తెలుగువీర లేవరా!
తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా || తెలుగు ||
దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా||2||
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా ||2||
నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా || తెలుగు ||
యెవడువాడు యెచటివాడు యిటువచ్చిన తెల్లవాడు
కండబలం కొండఫలం కబళించే దుండగీడు
మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు
తగినశాస్తి చెయ్యరా తరిమితరిమి కొట్టరా
ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి
ప్రతిమనిషి తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుపెట్టి తుది సమరం మొదలుపెట్టి
సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి
వందేమాతరం వందేమాతరం || తెలుగు ||
ఓ స్వాతంత్ర్య వీరుడా స్వరాజ్య భానుడా - అల్లూరిసీతారామరాజా
అందుకో మా పూజలందుకో రాజా అల్లూరి సీతారామరాజా
తెల్లవారి గుండెల్లో నిదురించినవాడా
మా నిదురించిన పౌరుషాన్ని రగిలించినవాడా
నిశ్ఛచయముగ నిర్భయముగ నీ వెంటనే నడుస్తాం || తెలుగు ||
