త్రిలింగ దేశం

bookmark

త్రిలింగ దేశం మనదేనోయ్,
తెలుంగులంటే మనమేనోయ్
మధురం మధురం మధురం మధురం
ఆంధ్రమ్మంటే అతిమధురం
దేశభాషలా తీరుల్లోకీ, ఆంధ్రమ్మంటే అతిమధురం
రాయలు మనవాడోయ్
పండితరాయలు, మనవాడోయ్
కలం తిక్కనా, ఖడ్గ తిక్కనా,
గణపతిదేవులు మనవారోయ్!!
అమరావతి నాగార్జున కొండా,
సిద్ధహస్తులా శిల్పాలోయ్
మల్లినాధ కుమారభట్టులు,
అందెవేసినా హస్తాలోయ్!!
గోదావరి కృష్ణా, తుంగభద్రా పెన్నా
కని పెంచినవోయ్ తెలుగుజాతిని,
వినిపించనీవోయ్ వీణానాదం!!
ఓడలు కట్టామూ
మింటికి, మేడలు కట్టామూ
మున్నీరంతా ఏకరాశిగా
ముద్దరవేశామూ!!
సంతలలో వజ్రాల రాసులూ,
జలజలలాడినవీ
కుబేరతుల్యం మహదైశ్వర్యం
గొడుగుపట్టినాదీ!!
కళకళలాడే తెలుగుదేవికి,
గంధాగరుధూపం,
కిలకిలలాడే తెలుంగు కన్నెల
కిన్నెరలలాపం
బలం గడించీ - వెలుంగు నింపే,
తెలుంగు ఝండా "హు"
తెలుంగు భేరీ "ఢాం"
గణగణ గణగణ గణగణ గణగణ,
తెలుంగు జయఘంటా!
గణగణా గణాగణ, గణాగణా గణ,
తెలుంగు జయఘంటా... || త్రిలింగ||