తెలుగుతల్లి
సిరుల నిచ్చే కన్నతల్లి!
శుభము గూర్చే కల్పవల్లి!
దీవెనల దయచేయవే భూ
దేవి మనకి తెనుగు తల్లి!
కల్లకపటము లేమి తెలియని
పిల్లలందరి ప్రేమజూపి!
ఎల్లవేళల నీదు కృప వెద
జల్లి బ్రొవవె పాలవెల్లి!
విద్యలొసగవె మాకు జననీ
బుద్ధిగరపవె ఆంధ్రవాణి
పాడిపంటల నిచ్చి యందరి
కడుపు నింపవె కృష్ణవేణి
బాలచంద్రుని పాపరాయుని
మల్లమాంబను గంటివమ్మా
పౌరుషముతో తెలుగు వీరుల
తీర్చిదిద్ది తరలిస్తివమ్మా!
