తెలుగు బావుట కన్ను చెదరగ
వీరగంధము తెచ్చినారము
వీరు డెవ్వడొ తెల్పుడీ!
పూసిపోదుము మెడని వేతుము
పూలదండలు భక్తితో!
తెలుగు బావుట కన్ను చెదరగ
కొండవీటను నెగిరినప్పుడు
తెలుగు వారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు
తెలుగు వారల వేడినెత్తురు
తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందున వున్న సహ్యజ
కత్తి నెత్తురు కడిగినప్పుడు
ఇట్టి నందియమెన్నడేనియు
బుట్టలేదు రవంతయున్
ఇట్టి నందిన మెన్నడేనియు
లేకపోయిరి సుంతయున్
నడుము గట్టిన తెలుగు బాలురు
పనున్ తిరగం డెన్నడున్
బాస యిచ్చిన తెలుగు బాలుడు
పారిపోవండెన్నడున్
ఓరుగంటిని దండు విరిసిన
దేవగిరి యాదవ నృపాలుని
ఓరుగంటను గాంచి యప్పుడె
దేవగిరి దర్వాజ వఱకున్
తఱిమి తోల్కొని పోవబోవగ
వూరి మేరియ? నభయమిచ్చిన
తెలుగు దొరసానైన రుద్రమ
దేవి కీర్తిని లోక మెఱుగదె
తెలుగు వారల యాడుబిడ్డల
తెగువ బిగువులు తెలుసుకొనుమా
వీర రసమే వెల్లివిరియగ
వెనుక తగ్గని వల్లెవాటనె
కాలి బంటుల కాలిక్రిందను
నలిగిపోయిన దండుబాటల్
అరులమూకను జెరల బెట్టిన
అరిరియగు మాచెఱల కోటన్
పేరుగ్రుచ్చియు బిలిచి యడిగుము
తెలియవచ్చును తెలుగు వ్రేటున్
ప్రాతకతలన్ బాడకుండిన
దెలుగు బిడ్డా! ఓరువు రక్కునె?
ఢిల్లీ సులతాన్ ఫౌజు దారులు
ముట్టడింపగ మూడు మాఱులు
తురుక కత్తులు దాకినంతనె
మంయి మంయిన గంటు నెత్తురు
పొంగి పొరలగ వోరుగంటను
ద్రోలివేయవె ఢిల్లీదాకను
తెలుగు కత్తులు తురక బిడ్డల
దెంపు పెంపున వెల్లవాటగ
పెద్దవారల బిలిచి యడుగుము
తెలియ బరుతురు తెలుగు ఢంక
రెడ్డి దొరలును కమ్మ దొరలును
రాచదొరలును మొక్కవోనని
పౌరుషంబుల బోరు సలిపియు
గౌతమీ నది కృష్ణవేణిని
తుంగభద్రను సహ్యాజీనది
నెత్తు రొలికిరి కాలవశమున
గత్తి గడిగిరి మూలబెట్టిరి
ఇంతమాత్రానె మఱచి పోకుము
తాతతండ్రుల వన్నె చిన్నెలు!
మఱచిపోకుము మఱచిపోకుము
మన్నె దొరలను తెల్గునాటను
మఱవ కుండగ మూడు ప్రొద్దుల
బాడు చుండుము వారి పాటను
తేటమాటల దెలియ జెప్పుము
దిక్కులన్నియు మారుమ్రోగిన
తెలుగువారల పేరు పెంపును
దెలియకుండక వుండబోకుము
తెలుగు బాలుర! యింపు నింపుము
తెలుగు బాలుర! పేరు పెంపుము!
