ఆపదైన వేళ నరసి బంధుల జూడు
ఆపదైన వేళ నరసి బంధుల జూడు
భయమువేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం-
ఆపదలో ఉన్నప్పుడు చేయూతనిచ్చినపుడే బంధువు అనిపించుకుంటారు. భయంకలిగే సందర్భంలో ధైర్యంగా ఉన్నప్పుడే ఆ మనిషిలోని సాహసం బయటపడుతుంది. పేదరికంలో కూడా భర్తను గౌరవంగా చూసినపుడే భార్య గుణం బహిర్గతమవుతుంది.
బంధువునని చెప్పుకుంటూ తిరగటం కాదు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడే బంధువు అన్నదానికో అర్థముంటుంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అందరూ ధీశాలులే. భయాందోళన కలిగే సందర్భాల్లోనే వారి అసలు ధైర్య సాహసాలు వెల్లడవుతాయి. భర్త సంపాదించినంత కాలం గౌరవంగా చూడటం కాదు, సంపదలుడిగినపుడు కూడా అంతే గౌరవంతో చూసినప్పుడే భార్య లోని సుగుణం తెలుస్తుంది. భార్యా భర్తలు కానీ ప్రేమికులు కానీ అవకాశం చిక్కినప్పుడల్లా ఐ లవ్ యూ అనటం కాదు, భర్త ఆస్తి కరిగిపోయి జవసత్వాలుడిగిన సమయంలో కూడా గౌరవంగా చూస్తేనే ఆదర్శవంతమైన భార్య అనిపించుకుంటుంది. అలాగే, వేమన ఈ పద్యంలో ఈ మాట రాయలేదు కానీ, యవ్వనంలోనే కాకుండా అందం తరిగిపోయినప్పుడు కూడా భార్యను ప్రేమగా చూసుకున్నప్పుడే ఆదర్శవంతమైన భర్త అనిపించుకుంటాడు.
