తరువ దరువ బుట్టు దరువునందనలంబు

bookmark

తరువ దరువ బుట్టు దరువునందనలంబు
దరువదరువ బుట్టు దధి ఘృతంబు
తలపదలప బుట్టు తలపున తత్త్వంబు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం-
పూర్వకాలంలో అగ్గిపెట్టెలు లేనప్పుడు నిప్పు పుట్టించటానికి రెండు కర్రలను తీసుకుని వాటిని బాగా రుద్దేవారు. అడవిలో అలాగే దానంతటదే నిప్పు పుడుతుంది. దాన్ని దావానలం అంటారు. ఇప్పటికీ యఙయాగాదుల్లో నిప్పు రాజేయటానికి ప్రత్యేకమైన కర్రలనే వాడుతారు. వాటిని అరణి అంటారు. వాటిలోంచి వచ్చే నిప్పు రవ్వలను దూదిమీదకు వచ్చి మండేటట్టుగా చేసి యఙానికి వాడుతారు.

అలా, ఒక కర్రతో మరోదాన్ని బాగా రుద్ది నిప్పు పుట్టిస్తాం, పెరుగుని బాగా చిలికి నెయ్యి వచ్చేట్టుగా చేస్తాం. అలా, మథనం చేసినప్పుడే వెన్న వస్తుంది. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను, చీజ్, విడివిడిగా ప్యాకెట్స్ లోదొరుకుతున్న ఈ కాలంలో అవన్నీ పాల ఉత్పాదనలేనని పిల్లలకు ప్రత్యేకంగా చెప్పవలసివస్తుంది. అదే విధంగా మనసులో కూడా మథనం జరిగినప్పుడే కొత్త ఆలోచనలు పుడతాయి. అందుకే విద్వత్తుల చర్చలను మేధో మథనం అంటారు. మనసులో వచ్చిన ఒక మంచి ఆధ్యాత్మిక ఆలోచనను మథించి మథించి చివరకు దాని సారాన్ని కనుగొనటం జరుగుతుంది. దాన్నే తత్త్వం అంటారు- ఒక ధర్మ సూక్ష్మం!

అలా, మనసులో మెదిలే ఆలోచనలను సక్రమంగా ఒక పంథాలో సాగిస్తూ దాని సూక్ష్మంలోకి పోవటాన్ని ఙానయఙమంటారు.