పండుగరోజు

bookmark

ఏడు కోట్ల పూలువిరిసి మురిసిన పండుగరోజు
విరుల తావు లచ్చరలై వియచ్చరలైన రోజు
నెల బాలుడు మిన్నులు దిగి నేలకు వచ్చినరోజు
కొమ్మల్లో కోయిలనై కుహుకుహు అన్నాను
నదుల మతులు పులకరించి నాట్యం చేసిన రోజు
గట్లు త్రెంచి సముద్రాల కౌగిలించుకున్న రోజు
ప్రభాత ప్రదోషాలు పసుపు కుంకుమలు చల్లిన రోజు
భావాలు రంగుల తోరణాలై ద్యోవా పృధుల మధ్య ఎగిరిన రోజు
మమత విశాల మానవతకు కర్పూర నీరాజన మిచ్చిన రోజు
ఉల్లిపార కాగితాన్నై ఊదా రంగు పులుముకొని
ఒక ఉజ్వల పతాంగాన్నై అనంత నీలిమలో విహరించాను
ధరిత్రి తిరిగెను చరిత్రలో ఒక పేజీ పెరిగెను
చైత్రం విరిసిన తోటకు ఝంఝూమరత్తు వచ్చెను
పూల గుండెలను హోలాహోల పూరితాలు చేశారు
వెన్నెలలు వెలార్చు విషజ్వాల రగిల్చారు
విరులు రాలి తరులు కూలి ఝరుల నీరు జారిపోయి
జీవకాంత లారిపోయి సుందర వందర లైతే
ఏ కొమ్మలు చేరి నేను ఏ గీతిక పాడతాను
ప్రపంచ విపంచి పంచమ స్థాయి నెట్లు చేరుతాను
రెండు యెదలు కలియు మాట రెండు యదలు కలుపు చేత
పొదలించుము సోదరుడా చదలందున నీ చరిత్ర
రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైనా
లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా?
మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలనీకుంటే
ధరాగమన మంతటితో తలక్రిందై పోతుందా?
కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలం జయమొస్తే
విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా?
దనుజలోక మేకంగా దారినడ్డు నిల్చుంటే
నరజాతి ప్రస్థానం పరిసమాప్త మవుతుందా?