తెనుగుబాస
మంచి గుమ్మడికన్న దంచిన యెఱ్రని
క్రొప్పడ్ల బియ్యము కూడుకన్న
మేల్ జహంగీరు మామిడి పండుకన్న నుం
కాఱున లే సజ్జ కంకికన్న
కమియ పండిన ద్రాక్షకన్న, చెక్కర తీగ
బోసి వండిన పాల బువ్వకన్న
రస దాడికన్న పనస తొనకన్న క
జూరముకన్నను జున్నుకన్న
అలతి పెరతేనియలకన్న ఆమని తఱి
కొసరి కూసిన కోయిల కూతకన్న
ముద్దు లొలికెడి జవరాలి మోవికన్న
తెయ్యనైన దెయ్యది? యదే తెనుగు బాస
కడిది యక్కరముల కలయిక సమసక
మ్మన దయ్యు నూగించు పసరు కలది
వీణ యూదిన యట్లు కూర్పు కలది
శివకవి హరిహర కవులకు మఱచిపో
నటుల జనుల చేసి నలవు కలది
తొమ్మిది లక్షల దొడ్డ పోటది విండ్ల
నారి మ్రోయించిన ధీర గలది
మీరు కృషి చేయనిది నేటి మీ కవులకు
పట్టుదల లేనిది తెనుంగు బాసయంచు
గుర్తెరుగు డోయి దేశమున్ గుర్తెరిగించు
ననుంగులార! పల్బాసల మఱుగులార!
ఈ బాస ధూర్జటి ప్రేలాపనగ బల్కి
కన్నబోయడు ముత్తికాలు ద్రొక్కె
ఈ బాసలో లా కు నేర్వము దా కు కొ
మ్మీయక భాస్కరు డిపుడు నుండె
ఈ బాస మాటాడి యెల్లరు గణపతి
ఒక్క గొడుగు నీడ నుంచి మురిసి
ఈ బాసతో కాపుటిండ్ల పాలించి రా
యల భువన విజయం బందుకొనియె
క్రోల్పులిని చూచి కుందేలు గుఱ్రుమనిన
చప్పు డీ బాసలోనిది చెప్పవచ్చు
నెంతయేని తెనుగుదన మంత గూర్చి
దీని కీనాడు పట్టిన దిగులు గూర్చి
కడుపు కొఱకును మిక్కిలి ముడుపు కొఱకు
కీర్తి కొఱ కధికార విస్పూర్తి కొఱకు
నెన్ని వేసాలు వేసిన నేమికాని
మాతృభాష చక్కగ నేర్చి మనుత నరుడు
పైడికి నింబదమ్మునకు ప్రాతలు క్రొత్తలు లేవు లేనిచో
వాడుక లేనియట్లే యగు బావి జలమ్ములు వోలె శబ్దముల్
వాడు కొలంది శోభలును పంతము పట్టుడి నేడు నాల్కపై
నాడవలెన్ చతుర్విధ మహాంధ్ర మశేష మటంచు నాంధ్రజు;
మూవురు లింగ మూర్తులకు భోగము సెల్లెడు నంతదాక గో
దావరి పాయ పాయ వఱదల్ రవళించెడు నంతదాక కృ
షా నిమిలాంబు పూరమున చంద్రిక లాడెడు నంత దాక నాం
ధ్రావని కైత జోతి కఖిలావని పళ్ళెరమై తనర్చుతిన్
