కానివానితోడ గలసి మెలగుచున్న
కానివానితోడ గలసి మెలగుచున్న
గానివానిగానె కాంతురవని
తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం-
చెడు నడవడిక కలిగిన వారితో కలిసి తిరిగినట్లయితే వీరు కూడా చెడ్డవారి జాబితాలో చేరిపోతారు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా సరే, అతను కల్లు తాగుతున్నాడనే అనుకుంటారు కానీ పాలు తాగుతున్నాడని అతన్ని ఎవరూ అనుకోరు.
పోలికలు చెప్పటంలో దిట్టైన వేమన, తాటి చెట్టు కింద పాలు తాగేవారితో పోలుస్తూ, చెడ్డవారితో స్నేహం చెడ్డది సుమా అని హెచ్చరిస్తున్నారు. పాలు, కల్లు కూడా తెల్లగానే ఉంటాయి. పాలు తాగేవారెవరూ తాటి చెట్టు దగ్గరికి పోయి తాగరు. కానీ ఒకవేళ అలా తాగుతుంటే అతన్ని చూసేవారు అతను తాగేది పాలు అని అనుకోరు కదా, అలాగే చెడు ప్రవర్తనతో దుందుడుకు చర్యలతో తిరుగుతుండేవారితో స్నేహం చేసి వారితో కలిసి ఆవారాగా తిరిగితే, ఆ మనిషి ఎంత మంచివాడైనా సరే, అతన్ని కూడా చెడ్డవాడిగానే పరిగణిస్తారు. మానవులంతా ఒకటే, అందరూ సమానులే సర్వమానవ ప్రేమ కలిగివుండాలి, ఇదంతా నిజమ, ఎవరినీ తక్కువగా చూడనక్కరలేదు కానీ, అలాగని అందరితో పూసుకుని తిరగటం కూడా ముప్పు తీసుకురావొచ్చు. అందువలన మనం ఎలాంటివారితో చెలిమి చేస్తున్నామన్నది ఆలోచించవలసిన విషయం. ఏజాతి పక్షులు ఆ జాతి పక్షులతోనే కలిసి ఎగురుతాయని, ఒకేరకం మనస్తత్వాలు కలగినవారే కలిసి మనగలరని మనుషుల నమ్మకం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే సమాజంలో మెసులుకోవాలని వేమనాచార్యుల హెచ్చరిక.
