తనువు దెవరి సొమ్ము తనదని పోషించి

bookmark

తనువు దెవరి సొమ్ము తనదని పోషించి
ద్రవ్య మెవరి సొమ్ము దాచుకొనగ
ప్రాణ మెవరి సొమ్ము పారిపోవక నిల్వ
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం-
ఈ శరీరమెవరిది పెంచి పోషించటానికి, ఈ ధనమెంతా ఎవరిదని దాచుకోవటానికి, ప్రాణం ఎవరిదని దాన్ని కాపాడుకోవటానికి?

అత్యున్నతమైన ఙానమున్నదీ పద్యంలో. నాది అని అనుకున్నప్పుడే దాన్ని రక్షించుకుని, పోషించుకుంటూ, పెంచి పెద్ద చేసుకుంటూ, జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండటమే కాకుండా అవి పోయినప్పుడు, వాటికి నష్టం జరిగినప్పుడు బాధ కలగటం జరుగుతుంది. సంపదలున్నప్పుడు గర్వం, పోయినప్పుడు విచారం, లేనప్పుడు తపన, ఉన్నప్పుడు పోతుందేమోననే భయం, తనకంటే ఇతరులకు ఎక్కువున్నప్పడు ఈర్ష్యాసూయలు, ఇతరుల సంపదలు తగ్గిపోయినప్పుడు లోలోపలే సంతోషం, ఇవన్నీ నావి అని భావించినప్పుడే వస్తాయి.

నిజానికి ఎవరివి ఈ సంపదలు కానీ, మీరు అని మీరనుకునే మీ శరీరం కానీ, మీది అనుకునే మీ ప్రాణం కానీ? ఎందుకు వాటికోసం అంత తపన, ఆశ, వ్యథ, గర్వాతిశయాలు? ఇది చెప్పినంత మాత్రాన అర్థం కాదు. ఈ సత్యం మనసులో ఇంకాలి. అప్పుడు పుట్టేదే వైరాగ్యం. వైరాగ్యంలోంచే ఙానం వస్తుంది. వైరాగ్యమంటే 'నాకు వద్దు' అని అనుకోవటం కాదు. కావాలని అనుకున్నప్పుడు ఆ వస్తువు ప్రభావం ఎలా ఉంటుందో అలాగే. 'వద్దు' అని అనుకోవటం కూడా ఆ వస్తు ప్రభావానికి లొంగటమే అవుతుంది. 'రాగం'- అంటే ప్రత్యేకమైన ఇష్టం లేకపోవటమే వైరాగ్యం!. అన్నిటినీ సమానంగా చూస్తూ తన ధర్మాన్ని నిర్వర్తించటం ఒక్క విరాగికే సాధ్యం. ఆ వ్యక్తి దేన్నీ 'నాది' అని అనుకోడు, 'నాది కాదు' అని తృణీకరించడు కూడా. ఆ లక్షణం సంతరించుకున్నప్పుడు ఆ మనిషి ముక్త పురుషుడౌతాడు. అన్ని బాధలకూ అతీతుడౌతాడు. కేవలం వస్తు లాభం వలన వచ్చే ఆనందం కాకుండా ఎల్లప్పుడూ ఆనందంలో ఓలలాడుతుంటాడు. యోగులు పేర్ల చివర 'ఆనంద' అని పెట్టుకోవటానికి అదే కారణం. వారిది మామూలు ఆనందం కాదు కాబట్టి దాన్ని 'బ్రహ్మానందం' అంటారు. వారు వ్యథలనుంచి దూరమవుతారు కాబట్టి వారిని 'ముక్త పురుషు' లంటారు.