విద్యలేనివాడు విద్యాధికుల చెంత
విద్యలేనివాడు విద్యాధికుల చెంత
నుండినంత బండితుండు కాడు
కొలని హంసలకడ గొక్కెరయున్నట్టు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం-
హంసల మధ్యలోనే తిరుగాడినా కొంగ ఎప్పటికీ కొంగే. అలాగే చదువుకున్న వాళ్ళ మధ్య తిరుగుతూ కాలం గడిపినంత మాత్రాన విద్యావంతుడనిపించుకోరు.
హంస అనే పక్షిని పురాణాల్లో వర్ణిస్తారు. పూర్వకాలం ఆ జాతి పక్షులుండేవని నమ్మకం. హంసలకుండే లక్షణాలు- స్వచ్చమైన తెల్లదనం, సుందరమైన రూపం, దేవతల పక్షి అనే పేరు, భూమ్మీదనే కాకుండా దేవలోకంలో కూడా విహరిస్తుంటాయని నమ్మకం, స్వచ్ఛతకు మారుపేరైన హంసకి పాలల్లో నీళ్ళు కలిపి ఇచ్చినా అందులోంచి హంస పాలని తాగి నీళ్ళని వదిలిపెట్టగలిగే విశేష సామర్థ్యం. కొంగలు కూడా తెల్లగా ఉన్నా, కొలనుల్లోనే విహరించినా, అది ఎప్పటికీ హంస లక్షణాలను సంతరించుకోలేదు. అలాగని హంసలతో తిరుగుతూ ఉంటే వాటి లక్షణం ఏమైనా అంటుకుంటుందా అంటే అద ఎలా సంభవం.
