తెలుగు సూక్తులు - 23
1. ఇది యుక్తం, ఇది అయుక్తం అని మనసులో విచారించకుండా మంచివారికీ, బలహీనులకూ ఉద్దేశపూర్వకంగా హాని చేసే దుర్మార్గులకు ఏ కారణమూ లేకుండానే ఆపదలు ముంచుకొస్తాయి.
2. ఒకడు తన దగ్గఱికొచ్చి “అయ్యా ! ఇది ఏమిటి, ఎందుకు, ఎలా ?” అని సవినయంగా అడిగితే, తనకు తెలిసీ చెప్పనివాడూ, నిజం చెప్పనివాడూ ఘోరమైన నరకపు బుఱదలో మునుగుతారు.
3. మహాఘోరనిష్ఠతో తపస్సూ, ఉదారమైన దక్షిణలతో యజ్ఞాలూ చేసినవారు కూడా ధర్మమార్గంలో తగిన కొడుకులను కన్నవారు పొందే ఉత్తమ సద్గతుల్ని పొందజాలరు.
4. తపస్సుని చెఱిచేదీ, అణిమాదిసిద్ధుల్ని పోగొట్టేదీ, ధర్మాచరణకు ఆటంకమయ్యేదీ కోపమే. అందుచేత కోపిష్ఠి కావడం తపస్వికి తగదు.
5. ఓర్మి లేని తపస్వి యొక్క తపస్సూ, ఏమరుపాటుగా ఉండేవాడి సంపదా, ధర్మపరత లేని రాజుగారి రాజ్యమూ – ఇవన్నీ కూడా పగిలిన కుండలో నీరు నిలవడంలాగా అబద్ధం.
6. ఎంత శమమూ, దమమూ గలిగినా ఎవఱూ చూడని ఏకాంతంలో స్త్రీల సాహచర్యం లభిస్తే మనుషులకి మనసు చలిస్తుంది. మన్మథుడి ప్రతాపానికి జనం తట్టుకోజాలరు.
7. యుక్తాయుక్త విచక్షణ అనేది ఎన్నో పూర్వజన్మల పుణ్యకర్మల ఫలితంగా కలిగేది. అలాంటి విచక్షణజ్ఞానాన్ని క్షణంలో హరించగల మద్యాన్ని సేవించడం ఉచితం కాదు.
7. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడూ, సర్వస్వాన్నీ కోల్పోయే సందర్భం తటస్థించినప్పుడూ, బ్రాహ్మణహత్య జఱుగుతుందనిపించినప్పుడూ, పెళ్ళి చేసుకునేటప్పుడూ అబద్ధమాడడంలో తప్పులేదు.
