శ్రీరాములవారు

bookmark

ఉత్తముని పేరేమి?
ఊరి పేరేమి?
సత్యపురుషులగన్న
సాధ్వి పేరేమి?

ఉత్తముడు దశరథుడు,
ఊరు అయోధ్య!
సత్యపురుషులగన్న
సాధ్వి కౌసల్య.

ఇల్లాళ్ళు ముగ్గురే
ఈ దశరథునకు;
పిల్లాళ్లు నలుగురే
పేరు గలవారు.

అయ్యోధ్యలో వారు
అంద రున్నారు;
సయ్యోధ్యలో వారు
సరిలేని వారు.

శ్రీరామ! జయరామ! శృంగారరామ!
కారుణ్య గుణధామ! కల్యాణనామ!
జగతిపై రామయ్య జన్మించినాడు,
సత్యమ్ము లోకాన స్థాపించినాడు.

తల్లిదండ్రులమాట చెల్లించినాడు,
ఇల్లాలితోపాటు హింసపడ్డాడు,
సీతామహాదేవి సృష్టిలోపలను,
మాతల్లి వెలసింది మహనీయురాలు.

అయ్యోధ్యరామయ్య అన్నయ్య మాకు,
వాలుగన్నులసీత వదినమ్మ మాకు.
రాములంతటివాడు రట్టుపడ్డాడు,
మానవులకెట్లమ్మ మాటపడకుండ!
సీతమ్మ రామయ్య దారిగదిలీతె,
పారిజాతపు పువులు పలవరించినవి.
సీతపుట్టగనేల! లంకచెడనేల?
లంకకు విభీషణుడు రాజుగానేల?
ఏడు ఏడూ యేండ్లు పదునాలుగేండ్లు,
ఎట్టులుంటివి సీత నట్టడవిలోను?
లక్ష్మయ్య నామరిది రక్షిస్తూఉండ,
నాకేమి భయ మమ్మ, నట్టడవిలోను?
దేవునంతటివాడు జననింద పడెను,
మానవుం డెంతయ్య మాటపడకుండ?
అన్నదమ్ములులేక, ఆదరువులేక,
తోడులేకా సీత దూరమైపోయె.
దండమ్ము దండమ్ము దశరథరామ!
దయతోడ మముగావు దాక్షిణ్యధామ!