యేసు పశువుల కొట్టంలో జన్మించడం

యేసు పశువుల కొట్టంలో జన్మించడం

bookmark

ఈ చిన్న శిశువు ఎవరో మీకు తెలుసా? అవును, ఆయన యేసే. ఆయన పశువుల కొట్టంలో అప్పుడే జన్మించాడు. పశువుల కొట్టం అంటే పశువులను ఉంచే స్థలం. మరియ యేసును తొట్టిలో పడుకోబెడుతోంది, తొట్టిలో గాడిదలకు, ఇతర పశువులకు కావలసిన ఆహారం వేస్తుంటారు. అయితే యోసేపు, మరియలు పశువులతో ఎందుకు ఉన్నారు? అది పిల్లలు జన్మించే స్థలం కాదు కదా?

అవును అది పిల్లలు జన్మించే స్థలం కాదు. కానీ వాళ్ళక్కడ ఉండడానికి ఒక కారణం ఉంది. రోమా పాలకుడైన కైసరు ఔగుస్తు, ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి తాము పుట్టిన స్థలానికి వెళ్ళాలని ఆజ్ఞ జారీ చేశాడు. యోసేపు బేత్లెహేములో పుట్టాడు. అయితే ఆయన, మరియ అక్కడకు చేరుకున్న తర్వాత వాళ్ళు ఉండడానికి ఎక్కడా స్థలం దొరకలేదు. కాబట్టి వాళ్ళు పశువులతో ఉండవలసి వచ్చింది. అదే రోజున మరియ యేసును ప్రసవించింది! మీరు చిత్రంలో చూస్తున్నట్లుగా ఆయన బాగానే ఉన్నాడు.

యేసును చూడడానికి బెత్లెహేముకు వచ్చిన కాపరులు
గొర్రెల కాపరులు యేసు దగ్గరకు రావడం మీకు కనిపించిందా? వాళ్ళు రాత్రిపూట తమ గొర్రెలను కాచుకుంటూ పొలాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ చుట్టూ కాంతివంతమైన వెలుగు ప్రకాశించింది. వాళ్ళకు ఒక దేవదూత కనిపించాడు! గొర్రెల కాపరులు ఎంతో భయపడ్డారు. అయితే దూత, ‘భయపడవద్దు! నేను ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. నేడు బేత్లెహేములో ప్రభువైన క్రీస్తు జన్మించాడు. ఆయనే ప్రజలకు రక్షకుడు! ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటాన్ని మీరు చూస్తారు’ అని చెప్పాడు. అకస్మాత్తుగా అనేకమంది దేవదూతలు వచ్చి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. వెంటనే ఆ గొర్రెల కాపరులు యేసును చూడడానికి వెళ్ళారు. చిత్రంలో చూస్తున్నట్లు వాళ్ళు యేసును కనుక్కోగలిగారు.

యేసు ఎందుకు అంత ప్రత్యేకమైన వ్యక్తో మీకు తెలుసా? యేసు నిజంగా ఎవరో మీకు తెలుసా? ఈ పుస్తకంలోని మొదటి కథలో మనం దేవుని మొదటి కుమారుని గురించి తెలుసుకున్నామని గుర్తుకు తెచ్చుకోండి. ఆ కుమారుడు ఆకాశాన్ని, భూమిని, మిగతా వాటన్నింటిని సృష్టించడానికి యెహోవాతోపాటు పని చేశాడు. యేసు అంటే ఆయనే!

యెహోవా తన కుమారుని జీవాన్ని పరలోకంనుండి మరియ గర్భంలోకి మార్చాడు. మిగతా శిశువులు తమ తల్లుల గర్భంలో ఎలా పెరుగుతారో అలాగే మరియ గర్భంలోనూ వెంటనే శిశువు పెరగడం ప్రారంభించాడు. అయితే ఆ శిశువు దేవుని కుమారుడు. అలా యేసు చివరకు బేత్లెహేములోని పశువుల కొట్టంలో జన్మించాడు. యేసు జన్మించాడని ప్రజలకు చెప్పడానికి దేవదూతలు ఎందుకు అంత సంతోషపడ్డారో మీకిప్పుడు అర్థమైందా?