పరాచకాలు

bookmark

వదినగారూ మీరు వాసిగలవారు,
వండబోయినచోట కుండ నాకేరు!

బావగారూ మీరు ప్రతిభగలవారు,
నిండిన్నసభలోను పిండిబొక్కేరు!

చక్కిలాలాబుట్ట చంకబెట్టుకొని,
సభలోను మా బావ సంగీతపరుడు!

అత్తింటికోడలూ అలిగి పడుకుంది,
అలుకల్లు తీర్చవే ములుకుల్లకఱ్ఱ!

అట్లుతిని అన్నయ్య అలిగిపడుకుంటే
తిట్లుతిని వదినమ్మ తీపు లందింది!

పొద్దోయి పొద్దోయి అన్నయ్య వస్తే,
జల్తారు చీరల్లు కట్టు వదినమ్మ.

చింతాకు చక్కన్న చీర చక్కన్న,
సిరిదేవి మావదిన చీర చక్కన్న.

బావా బావా పన్నీరు,
బావనుపట్టుక తన్నేరు!

వీధివీధి తిప్పేరు,
వీశెడు గంధం పూసేరు!
చావడి గుంజకు కట్టేరు,
చప్పిడి గుద్దులు గుద్దేరు!

అందలము కోరింది కుందనపుకుచ్చు,
అతిభోగి కోరాడు అత్తవారిల్లు;
పల్లకీ కోరింది పచ్చన్నికుచ్చు,
పరదేశి కోరాడు పంచటరుగుల్లు.