నమ్మలేనంతగా నేడు

bookmark

కొన్ని పుష్కరాల క్రితం తెలుగుజాతి వృక్షం పుష్పించింది
పుష్పించి వివిధ శాఖల
ఏకతా పరీమళాల శోభలను గుప్పించింది
పువ్వు ఫలంగా పరిణామం చెందే పరిణతి దశలో
నవ్వుల పాలైంది తెలుగుజాతి నమ్మలేనంతగా నేడు
తెలుగు జాతి వెలుగు జాతి
భాషా ప్రాతిపదిక ప్రమిదలో
ఐక్యత కాంతులు ప్రసరించిన దినం - నాడు
ముక్కోటి తెలుగువారి
మూడు ప్రాంతాలను ముడులె వేసి
మంగళ సూత్రంలా బంధించిన దినం - నాడు
సస్యశ్యామల సంభరిత శోభావృత ప్రాంతములు
సోదర భావ సంపన్నతి నందించి
వాత్సల్యామృతం గర్వంగా పంచుకున్న దినం - నాడు
కల లీడేరాలని తెలుగుజాతి జగత్కల్యాణ
సంఘటిత ప్రమాదాలకు
కంకణం కట్టుకున్న దినం - నాడు
శ్రీ రాములు దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరాయనగా
అవతరించిన సంఘటిత తెలుగు దేశం
ఆయన రక్తాశ్రువుల జనించిన
గారాల పట్టి పుట్టిన దినం - నాడు
తరతరాలు తెగి విడివడిన
తమ రావృత త్రిలింగ దేశం
పరస్పర ప్రేమాస్పద స్పందనలో
ఆనందపు దివ్వెలు వెలిగించిన దీపావళి - నాడు
ఆనాడు నేడై మోడుగా మారితిరి
కలలన్ని శిలలై కూకటి వ్రేళ్ళ ప్రసరణ స్థంభన చేసింది
కొద్ది తుఫాను గాలి చాలు వాలి రాలి పోడానికి
అశోకుడు నాటిన వృక్షం
అక్బరు పెంచిన చెట్టు అక్బరు పెంచిన చెట్టు
అన్నీ బోధించే దొకటే ఆ నీడలో అనురాగ స్పందనం
చరిత్ర చెరిగి పోయినా చెట్టు కనిపించక పోయినా
ఫలరసాస్వాదనలో ఆనాడు
ఫలించినవి జాతి ఆశలు ఆశయాలు
పువ్వు ఫలంగా పరిణామం చెందే పరిణత దశలో
నవ్వుల పాలైందితెలుగు జాతి
నమ్మలేనంతగా నేడు
ఉమ్మడి కుటుంబాలు గుంపుగా కలిసి బ్రతుకుతున్నాయి
దేశాంతర పరిణయాల జంటలు హాయిగా కలిసి జీవిస్తున్నారు
సర్వ జీవ జాల జాతుల్లో అనైక్యత లేనే లేదు
ఒకే గూటి పక్షుల్లో వేరు బ్రతుకు మిధ్య కాని
తెలుగుజాతి గూటిలో తెగులొకటి ఉద్భవించింది
తెలుగు భూమి బ్రద్దలయే భూకంపన శబ్దించింది
నాడు నేడై మాడిన మాడు రూపంలో ప్రతిబింబిస్తోంది
కొన్ని పుష్కరాల క్రితం తెలుగుజాతి వృక్షం పుష్పించింది
పుష్పించింది వివిధ శాఖల ఏకతా పరీమళాలను గుప్పించింది
తెలుగు జాతి వృక్షానికి తోటమాలి ఎవరైతేనేం?
కాలం పరిధిలో ఐక్యత తోయం పోయాలి కాని
పుష్ప పరిమళాలు ఫలరసాల చైతన్యం
పంపకం ఔచిత్యంతో ఫలప్రదం కావాలి
నరకాసుర వధతో దీపావళి వెలసింది నాడు
నరాసురులిచ్చే వ్యధలు బాపితేనే దీపావళి నేడు
అసుర శక్తులనినుమడించిన గతి తప్పిన మతుల
నఖ్యాతంలోకి త్రోసి సంతృప్తి సమాధులు కట్టాలి
శాతవాహనుల సహస్త్ర శతజయంతులు
ప్రతాపరుద్రుని సర్ణాంధ్ర గర్వకీర్తి
కృష్ణరాయని కర్ణాకర్ణ ధీధీతి
నన్నయ తిక్కనల భారత కవితా సౌరభాలు
బమ్మెర పోతన జగబ్ద్భిత భాగవత కర్పూర హారతి
గత చరిత్రలోంచి దాతలు వల్లించే కీర్తి మాటలు
దరిద్ర నారాయణుడవు నీవు
వీటిపై వరభాగ్యోన జీవిగా బ్రతకడం దేనికి
వర్తమాన చరిత్ర పుటలు భవిష్యత్తుకు ఉజ్జ్వల బాటలు కావాలి
వంకర గుంటల బాటలు చరిత్ర వాహనానికే ముప్పు
రుతువుల రాపిడిలో వృక్ష స్వరూపం మారినా
స్థిత ప్రజ్ఞ కూడిన సజీవ శక్త్రి నిత్యం వెలగాలి
దేశసర్వతోముఖ సంపన్నత అణువే దేశ వృద్ధి
జాతుల బహుముఖ ఉద్దీపనమే దేశ వృద్ధి
తరాల నుంచి మరలుగా పనిచేసే మానవ బుద్ధి
భారత నూతన చైతన్య వాశిత సమాజానికే ముద్దు
తెలుగుజాతి వెలుగు జోతి రోషద్వేషాల నుసి ప్రమిదతో
శాంతిద్రవ ఆద్రతతో ఐక్యకాంతులు వెదజల్లాలి నేడు