తెలుగు సామెతలు-వ

bookmark

* వంకరకట్టే కింగలమే మందు.

* వంకరటింకర కాయలేమిటి? అంటే, చిన్ననాడు అమ్మిన చింతకాయలు అన్నట్లు.

* వంకరో టింకరో వయసే చక్కన.

* వంకాయ తమ్ముడు వాకుడు కాయ.

* వంకాయ దొంగిలించినవాడు టెంకాయకు రాడా?

* వంకాయ రుచి తోటవాడెరుగును, అరటికాయ రుచి రాజెరుగును.

* వంకాయలేనమ్మ డొంకపట్టుక వేళ్ళాడిందట.

* వంకాయవంటి కూర లేదు, శంకరునివంటి దైవమూ లేడు (లంకాధిపువైరివంటి రాజు లేడు).

* వంగకు ముదురు నాటు, అరటికి లేత నాటు.

* వంగతోటకాడ మాత్రం వదినా (బావా) అనవద్దు అన్నట్లు.

* వంగతోటలో గ్రుడ్డివాని భాగవతం వలె.

* వంగతోట వానికి కన్నుగ్రుడ్డి, ఆకుతోటవానికి చెముడు.

* వంగ ముదురు - -వరి లేత.

* వంగలేనమ్మ టొంక పట్టూకొని ఏడ్చిందట (టొంక=టంకం).

* వంగనములో పుట్టినది, పొంగలిపెడితే పోతుందా? (వంగనము=వంశము, వంగడము).

* వంగితే తెలుస్తుందమ్మా! వరిమడి కలుపు, నిలబడినవానికి నీళ్ళు కారుతాయా?

* వంగినవాని కింద మఱీ వంగినవానికి వట్టలే తగులును.

* వంగుని వంకాయ, తొంగుని దోసకాయ తిన్నాడు అన్నట్లు.

* వంచని కాలి ధర్మం నా ఒడిలో ఉన్న దత్తా! కానక నా కాళ్ళు తగిలి నీ కళ్ళు పోయినవి.

* వంటంతా అయినదికానీ, వడ్లు ఒక (వాటు) పొలుపు ఎండవలె.

* వంట ఇంటి కుందేలు ఎక్కడికిపోతుంది?

* వంట ఇంటిలో చిలుకకొయ్య మినహాయింపు.

* వంట ఇల్లు కుందేలు సొచ్చినట్లు.

* వంట చేయ కెట్లు వంతక మమరురా?

* వంట ముగిసిన తరువాత పొయ్యి మండుతుంది.

* వంటలక్కను వయలుబండిమీద తెచ్చి, తోటకూరకు ఎసరెంత? అంటే, చంకచేతెడు పెట్టమన్నదట.

* వంటాపె అని తెచ్చుకుంటే ఇంటాపై కూర్చున్నదట.

* వండ నింటికి అగ్గిబాధ.

* వండని కూడు, వడకని బట్ట. (చాకలిది).

* వండమని అక్కకాళ్ళకు మొక్కవలె, వినుమని (తినమని) బావ కాళ్ళకు మొక్కవలె.

* వండలేనక్కకు వగపులు మెండు, తినలేనన్నకు తిండి మెండు.

* వండవే పెండ్లి కూతురా! అంటే, మందిని చూస్తూ మంచినీళ్ళు తెస్తానన్నదిట.

* వండా లేదు, వార్చాలేదు, ముక్కున్న మనసెక్కడిదే అన్నట్లు.

* వండింది తినెనో, గంజితోనే పోయెనో?

* వండినంతలోనే కుండకు దొరయగు.

* వండినంతవరకుండి, వార్చేలోపల పోయినట్లు.

* వండిన కుండలో ఒక్క మెతుకే పట్టి చూసేది.

* వండినమ్మ కంటే, దండుకున్నమ్మ మేలు.

* వండుకున్నమ్మకు ఒకటే కూర, అడుక్కుతినే అమ్మకు ఆరు కూరలు.

* వండుతూ ఉండగా వాంతి వస్తున్నది అంటే, ఉండి భోజనం చేసి పొమ్మన్నదట.

* వండేది అడ్డెడు, ఓగెంగా తిను అల్లుడా! అంటే, అన్నంపై ద్వేషమెందుకు? ఉన్నదంతా ఊడ్చిపెట్టత్తా అన్నాడట.

* వంతుకు మా పక్కవాడు, పాలికి మా బక్కవాడు.

* వంతుకు గంతేస్తే, ఒరు(రి)బీజం దిగిందట.

* వంతు పెట్టుకున్నా, వాత వేసుకొనేదాని కిచ్చి పెట్టుకోవాల.

* వంద మాటలు మాటలాడవచ్చు, వక్కనికి పెట్టేది కష్టం.

* వంపున్న చోటికే వాగులు పోతాయి.

* వంశం బొట్లంతమ్మా! కడివెడు కల్లెట్లమ్మా! వడబోసి అక్కడ పెట్టమ్మా1 వడవకున్న ఒట్టుబెట్టమ్మ! అందట.

* వంశమెఱిగి వనితను, వన్నె నెఱిగి పశువును కొనవలె.

* వక్క కొఱికి ఒక్కప్రొద్దు చెడుపుకొన్నట్లు.

* వక్క పేడిత్తునా, వనము దాటింతునా? చెక్క పేడితున్నా చేను దాటింతునా/

* వక్కలింత తప్పిన వగిరింత, వగిరింత తప్పిన వగిరింత. (వక్కలింత=వేవిళ్ళు).

* వక్రమా! వక్రమా! ఎందుకు పుట్టినావంటే, సక్రమైన వాళ్ళను వెక్కిరించను అన్నదట.

* వగచనట్టే ఉండాల, వాడి ఆలి తాడు తెగినట్లే ఉండాల.

* వగిచినట్టూ ఉండవలె, వాత పెట్టినట్టూ ఉండవలె.

* వగలమారి వంకాయ సెగలేక ఉడికినదట.

* వగలాడికి ముసలాతడు మగడైతే దాని వంత యింతింతా?


* వగలాడీ! నీకు మగలెందరే? అంటే, తొలి మగనితో తొంభైమంది అందిట.

* వగలాడీ! నీకు మగలెందరే? అంటే,తోలాడిగాడితో తొంభైమంది అన్నదట.

* వగలు ఎందుకంటే, పొగాకు కోసం అన్నట్లు.

* వగలేని మొగుడా పగ లెందుకు వచ్చినా వంటే, అందుకు కాదులే అగ్గికి వచ్చినా అన్నాడట.

* వగలేని వాడు లంజరిక మాడితే, ఇంటికి దుగ్గాని పంపకం.

* వగ్గు కోతికి సివమెత్తినట్లు.

* వచ్చింది క్రొత్త, వదిగి ఉండు అత్త.

* వచ్చిన కర్మం వద్దంటే పోతుందా?

* వచ్చిన కోడలు నచ్చితే, ఆడబిడ్డ అదిరిపడిందట.

* వచ్చిన వాడు పరాచుట్టము, మరునాడు మాడచుట్టము, మూడవనాడు ముఱికిచుట్టము.

* వచ్చిన పేరు చచ్చినా పోదు.

* వచ్చినమ్మకు ఒయ్యారము, రానమ్మకు రాగాలు.

* వచ్చినవారికి వరమిస్తాను, రానివారికి రాయి వేస్తాను.

* వచ్చిపోతూ ఉంటే బాంధవ్యము, ఇచ్చి పుచ్చుకుంటే వ్యవహారము.

* వచ్చీపోయేవాళ్ళు సత్రం గోడకు సున్నం కొడతారా?

* వచ్చీరాని చన్ను - పేరీ పేరని పెరుగు.

* వచ్చీరాని మాటలు, ఊరీఊరని ఊరగాయ రుచి.

* వచ్చీరాని మాట వరహాల మూట.

* వచ్చు కీడు వాక్కే చెప్పును.

* వచ్చేటప్పుడు ఉలవ, పోయేటప్పుడు నువ్వు.

* వచ్చేటప్పుడు తీసుకరారు, పొయ్యేటప్పుడు తీసుకపోరు.

* వచ్చేవారికి తట్టదింపి, పోయేవారికి తట్ట ఎత్తుట మంచిపని.

* వచ్చేవారికి స్వాగతం, వెళ్ళేవారికి ఆసీమాంతం.

* వజ్రానికి సాన - బుద్ధికి చదువు.

* వట్టల నొప్పి చీమ కేమి తెలుసు?

* వట్టలు గీరుకొన్నంత సుఖం, వైకుంఠంలో కూడా ఉండదు.

* వట్టలు వాసిన వీరారెడ్డీ! వడ్ల ధర ఎంతంటే, అవి ఉంటే ఇవి ఎందుకు వాస్తవి? అన్నాడట.

* వట్టింటికి పోచిళ్ళూ చల్లినట్లు.

* వట్టి అమ్మి కెందుకురా నిట్టూర్పులు?

* వట్టి గొడ్డుకు (గేదెకు) అరుపులెక్కువ, వానలేని మబ్బుకు ఉఱుము లెక్కువ.

* వట్టి గొడ్డుకు అఱ్ఱు లావు.

* వట్టిచేతులతో మూరవేసి ఏమి లాభం?

* వట్టి నిందలు చెప్పితే గట్టి నిందలు వచ్చును.

* వట్టి నేలలో కప్ప అఱచినా, నల్లచీమ గుడ్డుమోసినా వాన తప్పదు.

* వట్టి మాటలవల్ల పొట్టలు నిండునా?

* వట్టీ మట్టి అయితే మాత్రం ఉట్టినే (ఊరక) వస్తుందా?

* వట్టి విశ్వాసంతోనే ఏ పని కాకపోయినా, అది లేకపోతే మాత్రం ఏ పనీ కాదు.

* వడగండ్లు పడితే వఱపు.

* వడికిందంతా పత్తి అయినట్లు.

* వడ్డించి సద్ది తీసుకో.

* వడ్డించేవాడు (వారు) మనవారైతే కడపటి బంతిన కూర్చున్నా ఒకటే (మేలు).

* వడ్డి ఆశ మొదలు చెఱచును.

* వడ్డి, ఉప్పర సభామధ్యే, వైదికః పండితోత్తమః (సాలి జాండ్ర సభామధ్యే సాతానిః పండితోత్తమః).

* వడ్డికి చేటు, అసలుకు పట్టము.

* వడ్డి ముందఱ వడిగుఱ్ఱాలుగూడా పాఱవు.

* వడ్డెవానికి బిడ్డ అయి పుట్టేదానికంటే ధరణీపతికి దాసి అయి పుట్టేది మేలు.

* వడ్డోడికి పెండ్లాము పెద్దది కావాల (తట్ట ఎత్తి పనిచేయును), కాపోడికి గొడ్డు పెద్దది కావాల.

* వడ్లగాదిలో పందికొక్కు వలె.

* వడ్లగింజలోది బియ్యపుగింజ (అనుకొన్నంత రహశ్యం కాదనుట).

* వడ్లతో కూడా దాగర (తట్ట) ఎండినట్లు (దాగర=పెద్ద చేట).

* వడ్లరాసి వరదకు పోతుంటే, పాలోణ్ణి కనిపెట్టి ఉండమన్నాడట.

* వడ్లరాసి వరదకు పోయినా, వానకు కఱవు రాదు.

* వడ్లవాండ్ల పిల్లేమి చేస్తున్నది అంటే, వలకపోసి ఎత్తుకుంటున్నది అన్నాడట.

* వడ్లు ఏదుం, పిచ్చుకలు పందుం.

* వడ్లు, గొడ్లు ఉన్నవానిదే వ్యవసాయం.

* వత్తు పొయిలో పెట్టి తీనెపొయిలో తీసినట్లు (వత్తుపొయి=పొంతకుండ పొయ్యి; తీనెపొయి=తిన్నెపొయ్యి, ప్రక్కన గట్టుతో వేసినది).

* వత్తులు చెయ్యాలంటే ప్రత్తి కావాలి.

* వదినాలు పాడకుంటే, వరిబువ్వ (కూడు) ఎవరు పెడతారు?

* వదినెకు ఒకసరి, గుంజకు బిదిసరి.

* వదినె చందాన వచ్చి పావడ వదిలించిపోయినట్లు.

* వద్దన్న పని వాలాయించి చేస్తారు.

* వనం విడిచిన పక్షి, జనం విడిచిన మనిషి.

* వనవాసం చెయ్యలేరు, వంగి వంగి తిరుగాలేరు.

* పని(లి)కెం పట్టు విత్తితే వజ్రాల పంత కంత చూస్తాము.

* వనితగానీ, కవితగానీ వలచి రావాలి.

* వనిత లేనప్పుడు విరక్తి మంచిదనినట్లు.

* వన్నెకాని గంజి ఈగలపాలు.

* వన్నెకు సున్నం పెడితే వమ్మక పుండయిందట (వమ్మక=పరిహాసం).

* వన్నెచీర కట్టుకున్న సంబరమేకానీ, వెఱ్ఱికుక్క కఱిచిన సంగ తెఱుగదు.

* వన్నెబట్టలమ్మ వలపుడు కన్న, గుడ్డబట్తలమ్మ కులుకుడే లావు.

* వన్నె మాదిరే వన్నెపుడుతుంది, ఒళ్ళు వాచేది ఎఱుగదు.

* వన్నెలమ్మను ఎండబెట్టిన, ఇంటిరాజులను పండబెట్టిందట.

* వయసు కలిగిన నాడే వనిత వలపు.

* వయసు కురకుర, బాతు కురకుర.

* వయసు తప్పినా వయ్యారం తప్పలేదు.

* వయస్సు ముసలెద్దు, మనసు కోడెదూడ.

* వరదలు వస్తాయని వర్షా లాగవు.

* వరమైన పేరు గలిగిన గంగరావికి వందనమొనర్చగానే వరమొసగునా?

* వరపుకు వారధు లింకునా?

* వరవుడి ఇల్లాలౌనా, వాపు బలుపగునా? (వరవుడి=దాసి).

* వరహాకన్నా వడ్డీ ముద్దు, కొడుకుకన్నా మనుమడు ముద్దు.

* వరహాను ముప్పావు చేసుక వచ్చినా, మా యింటాయన ఎద్దుల బేరగాడైనా డంతేచాలు! అన్నదట.

* వరికి ఒక వాన, ఊదరకు ఒక వాన కురుస్తుందా? (ఊదర=వరిపైరులో మెలచే కలుపు మొక్క, దీని గట్టిగింజలు ధాన్యంలో కలిసి ఎంతచెరిగినా పోవు.)

* వరికి వాక, దొరకు మూక.

* వరి చెడి ఊదర బలిసినట్లు.

* వరి పందని ఊరు - దొర యుందని ఊరు ఒకటి.

* వరిపట్టు కడితే వర్షం (వాన) గొప్ప.

* వరిపొట్టకు పుట్టెడు నీళ్ళు (కావలె).

* వరిమొలక, మగమొలకా ఒకటి.

* వరి వడ్డు కేసి, తుంగ నాటు పెట్టినట్లు.

* వరుగుతో దాగరగూడా ఎండవలసినట్లు. (వరుగు= పండిన వంకాయ మెదలగు వానిని బద్దలుగా కోసి ఎండబెట్టినది; వంగ వరుగు).

* వరుసను దునితే వజ్రాలిస్తా నంటుంది భూమి.

* వరుసలెల్ల వల్లకాటిలో పెట్టి, వదినె పిన్నమ్మ ! గంపెత్తు.

* వర్లి వర్లి వాడు పోయె, వండుకతిని వీడు పోయె.(వరలు=వదరు).

* వఱపుకు మెఱుపులు, వట్టిగొడ్డుకు అఱపులు మెండు.

* వఱ్ఱేట ఓడ ఉండగా, వర దూదినట్లు (వఱ్ఱు=వెల్లువ, వఱద).

* వలకంటే ముందు రాళ్ళు విసరినట్లు.

* వలచివస్తే, మేనమామ కూతురు వావికా దన్నట్లు.

* వలపుకు పలుపు దెబ్బలు, వ(ఒ)య్యారికి చెప్పు దెబ్బలు.

* వలలోజిక్కిన మెకము చూడుదని వేటకాడు వదలునా?


* వల్లకాటి వైరాగ్యం, పురిటాలి వైరాగ్యం (స్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం).

* వసుక వేయబోయిన, వాతప్పులవాడు తగిలినాడు.

* వసుదేవుడు వెళ్ళి గాడిద కాళ్ళు పట్టుకొన్నాడట (చాలని కాలానికి).

* వస్తా ఏమి తెస్తావు, పోతా ఏమి ఇచ్చి పోతావు?

* వస్తా నన్నదాన్ని, ఇస్తానన్న వాణ్ణి నమ్మరాదు.

* వస్తానయ్యా! బాపనయ్యా! అంటే, వద్దే! ముండా! వర్జముంది అన్నాడట.

* వస్తావు పోతావు నా కొఱకు, వచ్చి కూర్చున్నాడు నీకొఱకు.

* వస్తుగుణం తెలియనివాడు వైద్యంలో మొనగాడే.

* వస్తూ ఇళ్ళు నింపుతుంది, పోతూ పెరళ్ళు నింపుతుంది (అరికె).

* వస్త్రహీనము విస్తరహీనము పనికిరావు.

* వసిష్టుని వాక్కున విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవలె.



**********:: వా ::**********

* వాంతి వస్తే పెదవు అడ్డమా?

* వాకిలి దాటగానే వారణాసి ఎంతదూర మన్నట్లు.

* వాక్చాతుర్యములేని వేశ్య, గుణకారము లేని లెక్క.

* వాగార్త చేలకు సొనలే వరవలు (వాగార్త=సముద్రతీరము).

* వాగు నీళ్ళు, వనం పత్రి.

* వాగులో పోతున్నావే సెట్టి? అంటే, లాభం లేందే పోతానా అన్నట్లు.

* వాగ్దానం ఎందరు అవివేకులనో తృప్తి పరుస్తుంది.

* వాగ్దానం చేసేవాడు వాటిని మరచిపోవడం గూడా నేర్చుకొని ఉంటాడు.

* వాచినమ్మకు పాచి(సి)నకూడు పెడితే, మాఅత్త పరమాన్నం పెట్టిందని ఇరుగింట పొరుగింట చెప్పుకున్నదట.

* వాడవదిన కేల వావివరుసలు?

* వాడికి నలభై జరిగింది (నలభై=40వ సంవత్సరం పరాభవ అంటే అవమానం జరిగింది).

* వాడికి వీడికి నిప్పుకు ఉప్పుకు (వలె ఉన్నది).

* వాడి కేడట్ఠాలే గ్రంథమయింది గానీ, మనకి పై అట్ఠలు కూడావచ్చు.

* వాడి తండ్రి, మాతండ్రి సయాం మగవాళ్ళు-అన్నట్లు.

* వాడిపోయిన పూవులు ముడుచువారుందురా?

* వాడు వట్టి ఇరవై ఐదు ఇరవైఆరు ( ఇరవై ఐదు =25వ సంవత్సరం ఖర, 26వది నందన, గాడిదకొడుకని).

* వాతికి వెరతునా, పీతికి వెరతునా అన్నట్లు.

* వాతాపి జీర్ణం - వజ్రశరీరం.

* వాద బ్రష్టుడు, వైద్య శ్రేష్టుడు (వాద= రసవాదం చేసినవాడు).

* వాది నాశం, ప్రతివాది మృతనష్టం, ప్లీడర్ల అదృష్టం, కోర్టువారి ఇష్టం.

* వాదు తెచ్చుకోవాలంటే, అప్పు ఇవ్వమన్నారు.

* వాదులేక ప్రాణం, దాదిలేక రాణి పోరు.

* వాదులేక వల్లూరికి పోతున్నాను, ఇరుగుపొరుగు నాసవతుల్లారా! ఇల్లు భద్రం (గంప ఎత్తండి) అన్నదట .

* వాదు సుమీ! అప్పిచ్చుట.

* వాన ఉంటే కఱవు, పెనిమిటి ఉంటే పేదరికం లేదు.

* వాన ఎక్కువైతే రొంపికరువు, వాన తక్కువైతే వరపు కరువు.

* వానకన్నా ముందే వరదనా?

* వానకు ఎచ్చయిన తేగి వెరచుగానీ ఎనుబోతు వెరచునా?

* వానకు ముందు ఉఱిమినా, మాటకు ముందు ఏడ్చినా తుదముట్టదు.

* వాన కురుస్తున్నది నాయనా, అంటే కురవనీలే అనగా, అట్లానే కురవనిస్తాలే అన్నాడట.

* వానతోడ వచ్చు వడగండ్లు నిలుచునా?

* వాననాటి వరద, పెళ్ళినాటి పప్పుకూడు.

* వానపొటుకుకంటే మ్రానుపొటుకు ఎక్కువ (పొటుకు అనే శబ్దంతో చినుకు పడుట).

* వాన బడాయి చవిటిమీద, మాల బడాయి పాటిమీద, మొగుడి బడాయి ఆలిమీద.

* వానరాకడ, ప్రాణం పోకడ ఎవఱెరుగుదురు?

* వానలకు మఖ(కార్తె) కుక్కలకు చిత్త(కార్తె).

* వానలుంటే పంటలు, లేకుంటే మంటలు.

* వానలు కురిస్తే వసుంధర.

* వానలు కురిస్తే వాతలు మాసిపోవు, బిడ్డలు పుడితే ఱంకులు మఱచిపోరు.

* వానలు ముంచతవోయ్ ! ముంచతవోయ్! అన్నాడట జ్యోతీష్కుడు (ఎగగొట్టినా ముంచుటే, ఎక్కువైనా ముంచుటే).

* వాన లెక్కడా? అంటే దానధర్మాలున్న ధరణిలో అన్నట్లు.

* వానలేని వట్టి పిడుగు వలె.

* వానవచ్చినందుకు వంక పారిందే గుర్తు.

* వాని ఇల్లాలు దొమ్మరివాని డోలు (ఆడేవాళ్ళందరూ మారి మారి వాయించుచుందురు).

* వాపును చూచి బలుపను కొన్నట్లు.

* వాపు బలుపు గాదు - వాత అందము గాదు.

* వాపు మానునుగాని వాతలు మానునా?

* వాములు మింగే స్వాములవారికి పచ్చిగడ్డిమోపులు పలహారము (బరోబరు).

* వామ్ము తింటావా, మామా? అంటే, వామ్ముపోసకు సందుంటే ఒక వడతునకే తిననా అన్నాడట.

* వాయిపట్టే సందే ఉన్న, ఒక భక్ష్యమైనా తినేవాడిని.

* వారకాంత జనంబులకు వావి గలదె?

* వారకాంతలేల వలచెదూరక?

* వారవనిత ధనికు చేరదీయగోరును.

* వారాశి దాటినను శని మారకుడై పట్టి చంపు.

* వాలుపై (వాదరపై) నడిచినట్లు (సాము).

* వాళ్ళు పిల్లనివ్వనన్నారు, నేను చేసుకోనన్నాను.

* వావివరుసదప్పి వర్తించి చెడుదురు.

* వాసానికి తగ్గ కూసం.

* వాసి తరిగితే, వన్నె తరుగుతుంది.

* వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తులాభారం తూగితే, కరెడ్ల కామక్క వంకాయలభారం తూగిందట.

* వాస్తుగలవారి కోడలు వరహా ఇచ్చి క్షవరం చేయించుకుందట.



**********:: వి ::**********

* వింటే బేగడ (రాగం) వినాల, తింటే మీగడ తినాల.

* వింటే భారతం వినాల, తింటే వడలు (గారెలు) తినాల.

* వింతలమారికి చండ్లు వస్తే మేనమామకు కండ్లు పోయినవట.

* వింతలేనిదే ఆవులింత పుట్టదు.

* విందు అయినా మున్నాళ్ళు, మందు అయినా మున్నాళ్ళు (మూడ్నాళ్ళు).

* విందు భోజనం చేస్తే, మిట్టచేనుకు ఒడ్డు (మడవ) వేసినట్లుండాల (బిఱ్ఱుగా ఉబ్బిపారును).

* విందు మర్నాడు మందు (కుందు).

* వికారంవాడు దుకాణం పెడితే, వచ్చే గిరాకీ అట్టే మరలిపోయిందట.

* వికిరాలలో లేడు, పిండాలలో లేడు (వికిర=పక్షి).

* విక్రమార్కునివంటి రాజు ఉంటే, భట్టి వంటి మంత్రి అప్పుడే ఉంటాడు.

* విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి.

* విఘ్నేశ్వరుని పెండ్లికి వేయి విఘ్నాలు.

* విచిత్రపు పచ్చిపులుసు ఈగలగొట్టి, తాలింపుపెట్టి ఇద్దరిని రమ్మంటే ముగ్గురు వచ్చారట.

* విచిత్రం, విన బూటకం! ఆలుగొట్ట మగడేడువ.

* విచిత్రపు పులుసుకూర విస్తరను మింగిందట.

* విజయుం డనువుదప్పి విరటుని గొలువడా.

* విజరానికి తగవు లేదు.

* విటుని పచ్చ జూచి తాళలేక తానిటు నిలను దిరుగుట. (పచ్చ=బంగారు).

* విడిచిన ఎద్దు కొట్టందారి చూచును.

* విడిచిన గుద్ద వీధికి పెద్ద.

* విడిచినది వీధికి పెద్ద, బరితెగించినది (విడిచినది) బజారుకు పెద్ద.

* విడిచిన ముండకు వీరేశలింగం, తెగించినవాడికి తెడ్డే లింగం.

* విడిచిన ముండలకు విడవలూరు (విడవలూరు=నెల్లూరు జిల్లాలో ఒక సంపన్న గ్రామం).

* విడిచిన ముండ వీధికి పెద్ద, బడివిడిచినముండ బజారుకు పెద్ద.

* విడిచిన లంజ వీధికెక్కితే, చావిట్లోవాళ్ళు చాటుకు పోయినారట.

* విడిచిపెట్టిన ఇంటిలో మఱచిన మంగలు (మంగ=అలమేలుమంగ)

* విడిపించబోయిన పాముకు పగ, విడిపించకున్న కప్పకు పగ (వగ).

* విడివడితే గుఱ్ఱం గాడిదతో సమానం.


* విత్తంకొద్దీ విభవము! విద్య కొద్ది వినయము.

* విత్తకుండానే కోస్తా మన్నట్లు.

* విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత?

* విత్తనం మళ్ళితే, విడవకుండా ఏడేండ్లు సేద్యం చెయ్యమన్నారు.

* విత్తనముకొద్ది మొక్క.

* విత్తనములో లేనిది విశ్వంలో లేదు.

* విత్తనము వేసి, పొత్తు కలిపినట్లు.

* విత్తనానికి దాపరికం (గుట్టు), విద్యకు వెల్లడి (రట్టూ) అవసరం.

* విత్తనాలకు పోయిన రెడ్డి, ఓదెలెత్తగా వచ్చినాడట (ఓదె=పైరుకోసి ఎండుతకు కయ్యలో బారులు బారులుగా వేసినవి).

* విత్తనాల సంచులు మంచివయితే, విత్తపుసంచులు నిండును.

* విత్తనా లుంటేనే పెత్తనాలు.

* విత్తహీనుడు ధర్మవృత్తి దలచు.

* విత్తిన కొలది పైరు.

* విత్తు ఒకటి వేస్తే, చెట్టు ఇంకొకటి మొలచునా?

* విత్తుకన్నా క్షేత్రం మెరుగు.

* విత్తుకు వేయి విత్తులు.

* విత్తుటకు శుక్రవారం, కోతకు గురువారం.

* విత్తు మంచిదయితే కాయా మంచిదగును.

* విత్తు మంచిదయితే రైతుకు మంచిదగును.

* విత్తు ముందా? చెట్టు ముందా?

* విత్తులు దీసిన కోడె - యీకలు పెరికిన కోడి.

* విత్తే చెట్టయ్యేది.

* విదియనాడు కనబడని చంద్రుడు తదియనాడు తనకు తానే కనబడతాడు.

* విద్యాప్రసంగముల్విన రసఙ్ఞతలేని రసికుల సభ, సభగాదు గ్రామరచ్చ గాని.

* విధవకు తలసుళ్ళు వెదకినట్లు.

* విధవకు మ్రొక్కితే ' నావలనే వెయ్యేళ్ళు వర్థిల్ల ' మన్నది, రెండోసారి దండం బెట్టితే, 'నా మొగుడు మాదిరే బ్రతుక ' మన్నదిట.

* విధవకు విరజాజి పూదండ కావలెనా? (లేల?)

* విధవైన మేలు, మగనికి తిథిబెట్టును, కథలు వినును, తీర్థము లాడున్.

* విధి వస్తే పొదలడ్డమా?

* వినకు, అనకు, కనకు (చెడ్డవి).

* వినయోక్తులు లేని ఈవి వ్యర్థము.

* వినరాదు, కనరాదు, అనరాదు (చెడ్డ).

* వినని బంటుకు వెన్నపూస కూడానా?

* వినను కనను రెండేసి ఇచ్చి, అనను ఒకటే ఇచ్చినాడు - దేవుడు (చెవులు, కన్నులు, నాలుక; అంటే ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాల అనుట).

* వినయం లోకవశీకరం, విద్య రాజవశీకరం.

* వినాయకుడిమీద భక్తా, ఉండ్రాళ్ళమీది భక్తా?

* వినాయకుని చేసియిస్తావా కుమ్మరీ అంటే, వాడి అబ్బను చేసిస్తానని లింగం చేసి యిచ్చినాడట.

* విని రమ్మంటే తిని వచ్చినట్లు.

* వినేవాటికి (చెవులకు) కనేవాటికి (కంద్లకు) బెత్తెడే దూరం.

* విన్న మాటకంటే చెప్పుడు మాటలు చెడ్డవి.

* విన్నమాట కన్నంత నమ్మదగింది కాదు.

* విన్నమ్మ వీపు కాలింది, కన్నమ్మ కడుపు కాలింది.

* విన్నవన్నీ విశ్వసించవద్దు, విశ్వసించినవన్నీ వెలిబుచ్చవద్దు.

* విప్రహస్తము వేదాండ హస్తము ఊరుకోవు.

* వీభూది పట్టెలు పెట్టుకుంటే, విష్ణుమూర్తి వనుకున్నానే, ఆంజనేయుడివటోయ్! వెంకటేశ్వర్లు.

* వియ్యంకునికి వీపుదెబ్బలు, వియ్యపురాలికి వీపుదెబ్బలు.

* వియ్యపురాలికి వీపుదెబ్బ, నాకు తోపుదెబ్బ.

* వియ్యపురాలి పేరు విసరమ్మ, నాపేరు దంచమ్మ (విసరు+అమ్మ; దంచు+అమ్మ).

* వియ్యపువారింట జాడ్యాలు ఇకిలించినా పోవు.

* వియ్యానికి కయ్యం తోబుట్టువు.

* వియ్యానికయినా, కయ్యానికయినా సాటి ఉండాల.

* వియ్యానికి కయ్యానికి సమతవలయు.

* వియ్యాలందితే కయ్యా లందుతవి.

* వియ్యాలవారింటికి పోతే వీపులమీదనే వస్తుంది (స్పొటకం).

* విరచుకొని విరచుకొని వియ్యపురాలింటికి పోతే, పలుగురాళ్ళతో నలుగు పెట్టిందట.

* విరామం లేని పశువుకు ఊరట లావు.

* విరాలికి ఆమనివంటి చుట్టము లేదు.

* విరిగిన వేలుమీద ఉచ్చ పోయనివాడు, వినాయకుడికి టెంకాయ కొడతాడా?

* విరిగేదాని కంటే వంగేదే మేలు.

* విరజాజి పూదంద విధవకేల?

* విరి దాస్తే తావి దాగుతుందా?

* విరుగుబాటు పైని నూనెబొట్టు, విరచికట్లపైని పెరుగుబొట్టు.

* విరోధికి అపశకునం కలిగించను, తనముక్కు కోసుకొని ఎదురుపడినాడట.

* విలుచుటకు ముందే విక్రయించే సులువు చూడాలి.

* విల్లమ్ములు కలవారికి చల్లకడవలవారు తోడా?

* విశాఖ (కార్తె) కురిసిన, విషము పెట్టినట్లు.

* విశాఖ చూచి విడువర కొంప (ఉత్తరజూచి ఎత్తర గంప).

* విశాఖ పట్టితే పిశాచి పట్టినట్లు.

* విశాఖ్స్యో మబ్బులు, మజ్జిగతో భోజనం సరి.

* విశాఖతో మేఘాలు, ప్రసూతితో యవ్వనము సరి.

* విశాఖ వరదలు - సంక్రాంతి మబ్బులు.

* విశేషము లేనిది వింతెలా పుడుతుంది?

* విశ్వాసం తప్పిన పీనుగు మోసినవాడిని పట్టిందట.

* విషపాళపు విత్తు, నేపాళపు గింజ.

* విషములో పుట్టిన పురుగుకు విషమే ఆహారం.

* విషములో పుట్టిన పురుగు విషములోనే జీవిస్తుంది.

* విషయం లేని వక్తకు వాగాడంబరం ఎక్కువ.

* విషానికి విషమే విరుగుడు.

* విసరగా, విసరగా ఒక రాయి, తిట్టగా తిట్టగా ఒక తిట్టు తగులును.

* విసిరిన రాయి గాలికి పోయినట్లు.

* విసరురాయి గాలికికొట్టుకపోతే, విస్తరాకు సంగతి చెప్పాలనా?

* విస్తరి(ర) కొదవా, సంసారపు కొదవా తీర్చేవారెవరు?

* విస్తరి చిన్నది, వీరమ్మ చెయ్యి పెద్దది.

* విస్తళ్ళు ఎత్తమంటే, భోంచేసిన వారెందరని లెక్కబెట్టినాడట.

* విస్సన్న చెప్పినదే వేదం.



**********:: వీ ::**********

* వీధిలో చెప్పుతో కొట్టి, ఇంట్లో కాళ్ళు పట్టుకొన్నట్లు.

* వీధిలోన దిరుగ వెలది పురుషుడౌనె?

* వీపు గుద్దరా శిష్యా అంటే, నీకంటే తక్కువ తిన్నదెవరు అన్నాడట.

* వీపు తోమరా! అంటే, ఇక్కడొక బొక్క ఉన్నదే అన్నాడట.

* వీపున తన్నుతుంటే, యింటివెనుక చప్పుడన్నట్లు.

* వీపుమీద కొట్టవచ్చును గానీ, కడుపుమీద కొట్టరాదు.

* వీరక్క పెండ్లిలో పేరక్క శోభనం.

* వీరన్న ముందు బసవన్న, గౌరి ముందు గణేశుడు.

* వీరభద్రపళ్ళెమునకు హనుమ త్పళ్ళెము.

* వీరభోగ్య వసుంధర.

* వీరోచిత కార్యాల సుగంధమే కీర్తి.

* వీలెరిగి మాట, కీలెరిగి వాత.

* వీసం ఇచ్చి, వాసానికి ఒడ్డినట్లు.

* వీసం ఖర్చు లేకుండా నోము నోముతాను, ఆశపడకండి అడవ నా బిడ్డల్లారా!

* వీసం గల అమ్మి విడువా ముడువా, కాసుగల అమ్మి కట్టా, పెట్టా.


* వీసం గల రెడ్డికి విడువా, ముడువా సరిపోయింది.

* వీసానికి వాసిన్నర అయితే, దూలన్నర ఎంత?

* వీసెడు చింతపండు పాసంగానికే సరిపోయింది. (పాసంగం=పడికట్టుట, దాళా,తక్కెడ తూకం మొదట సరిచేయుట).



**********:: వృ ::**********

* వృథా బోడ (సన్నాసి) వైతివి, పొందవైతివి.

* వృధనారి పతివ్రత.

* వృధ వైద్యం - బాల జోస్యం.

* వృష్టికి ప్రమాణం ఉత్తరహస్తలు (కార్తెలు).



**********:: వె ::**********

* వెంకటరెడ్డే కంకి కొరికితే, వెంటవచ్చినవాండ్లూ రకుంటారా?

* వెంకన్న తిండి జూచిన అంకాళ్ళమ్మకును సైతమరగుండె పడున్.

* వెంకయ్య వేమవరం వెళ్ళనూ వెళ్ళాడు, రానూ వచ్చాడు.

* వెంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది.

* వెంట పోయినా వెనుక పోరాదు.

* వెంటపోయైనా చూడాలి, యింట ఉండైనా చూడాలి.

* వెంట రావద్దంటే, ఎత్తుకోమని ఏడ్చాడట (బిడ్డ).

* వెంట్రుకకన్నా ఏడుపాళ్ళు సన్నం, రోకలికన్నా ఏడుపాళ్ళు లావు.

* వెంట్రుక పట్టుకొని ప్రాకులాడినట్లు.

* వెంట్రుకలు పెరికివేయగానే పీనుగు తేలిక అవుతుందా?

* వెంట్రుక లున్నమ్మ ఏకొప్పైనా పెట్టుతుంది.

* వెండి బేరమాడుతూ బంగారు కొసరినట్లు.

* వెంపలి పూస్తేనేమి, కాస్తేనేమి?

* వెంపలి చెట్లకు దోట్లు వేసినట్లు.

* వెక్కిరించబోయి బోర్లపడినట్లు.

* వెచ్చంగా ఉంటే ఏరుకతింటారు, పచ్చంగా ఉంటే పారిపోతారు.

* వెట్టికి కని వెలుగులో పాఱవేసినట్లు.

* వెట్టికి గదరా పోలా! అంటే, ఏడవక తప్పడే అయ్యా! అన్నట్లు.

* వెట్టికి చెపితే వేగుదాకా చెప్పమన్నట్లు.

* వెట్టికి పుట్టినబిడ్డ నెత్తికి లేక ఏడ్చిందట.

* వెట్టి గుఱ్ఱం, తంగెడు బఱ్ఱె.

* వెట్టి గొలువరాదు విభుడెంత ఘనుడైన.

* వెట్టి మూటకీ, పంక్తి భోజనానికి ముందుగా వెళ్ళాలి.

* వెట్టికి వెల ఏది?

* వెతకివెతకి వెయ్యి బళ్ళమీద వంటలక్కను తెస్తే, తగిలేని మిగిలేని తోటకూరకి తొడలోతు ఎసరు పెట్టిందట.

* వెదకి వెదకి యతడు వెఱ్ఱియై చెడిపోయె.

* వెదకు అదను అయితే, వెలుగులో చల్లినా మంచిదే (వెద=విత్తనము చల్లుట).

* వెదుక బోయిన తీగ కాలికి తగిలినట్లు.

* వెదుక బోయిన తీర్థ మెదురైనట్లు.

* వెధవ ముండకైనా వేవిళ్ళు తప్పవు.

* వెధవముండా! వేరుంద మన్నట్లు.

* వెనుక గుద్దరా శిష్యా! అంటే, వెనుక గుద్దగాక మొగం ఉంటుందా స్వామి- అన్నాడట.

* వెనుక తుమ్ము ముందుకు మంచిది.

* వెన్నకు పండిచ్చి, దూలాలు కంకిననాడు.

* వెన్నకు కళ్ళువచ్చి, ఏకులు కమికిన నాటికిగద!

* వెన్న కత్తి దెబ్బకోర్చునా?

* వెన్న కొద్దీ నెయ్యి.

* వెన్న చేతబట్టుకొని నేతికి వెదకినట్లు.

* వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే, చల్ల దాగినవాని చావమోదినట్లు.

* వెన్నతో కొట్టిన వానిని రాయితో కొట్టినట్లు.

* వెన్న దగ్గఱ ఉంచుకొని, నేతికి తడుముకొన్నట్లు.

* వెన్నను సన్నగా నూరినట్లు.

* వెన్న పెట్టితే మింగలేడు, వేలు పెడితే కఱవలేడు (కొఱకలేడు).

* వెన్నబడే సమయానికి బాన పగిలినట్లు (బాన=తరికుండ).

* వెన్నముద్ద కేల వేడినీరపు పొందు?

* వెన్నముద్ద పారవేసి వేళ్ళు నాకినట్లు.

* వెన్నయుండ నేతికెవరైన వ్యసనపడుదురా?

* వెన్నలా దున్నితే వెన్నులకేమి కొదువ? (వెన్నులు కొండలాది).

* వెన్నలో వెంట్రుక తీసినట్లు.

* వెన్ను మీద గువ్వ (గూబ; అరిష్టము) (వెన్ను=ఇంటివెన్నుగాడి).

* వెన్ను ముదిరి పొర్లిన గొడ్డు ఎక్కువ పాలిస్తుంది.

* వెన్ను మూరెడు, దంటు బారెడు.

* వెన్నెల దినాల్లోనే అల్లో(ల్ల)నేరేడి పళ్ళు.

* వెయ్యి ఆవులు కలవానికి ఒకటి (పాలి ఇవ్వక) తన్నిననేమి?

* వెయ్యి ఆవు లున్నవానికి ఒకటి ఎగజేసితే నేమి?

* వెయ్యి ఇండ్ల పూజారి వెతికినా దొరకడు.

* వెయ్యి కన్నులు రేయికుంటే, పగటికేమో ఒకతే (చుక్కలు, సూర్యుడు).

* వెయ్యి కాకుల కొకే రాయి.

* వెయ్యి పుట్ల వడ్లకు ఒక చిలుకపురుగు చాలు.

* వెయ్యి మోపులు వేకువజాము కట్టకు లోకువే.

* వెయ్యి మోపులు మంచుమోపుకు లోకువే.

* వెయ్యి రూపాయిలు కావలెనా? వెధవ తోడబుట్టువు కావలెనా?

* వెయ్యి రూపాయలు పెట్టి ఎద్దును కొన్నా, ముల్లుకఱ్ఱ ఉండాల.

* వెయ్యి రూపాయిలు పెట్టి ఏనుగును కొని, అరవీసం అంకుశానికి పాలు మాలినట్లు.

* వెరపింపగాబోయి వెరచినట్లు.

* వెఱ్ఱి కుక్కను బట్టి వేటాడవచ్చునా?

* వెఱ్ఱి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడట.

* వెఱ్ఱి గుద్దకు వేపాకు కడితే, దూడా బఱ్ఱె దూసుక తిన్నవట.

* వెఱ్ఱి గుద్దకు వేపాకు కడితే, ఊరి బఱ్ఱెగొడ్లన్ని వెంటబడినవట.

* వెఱ్ఱిది వెంకటమ్మ మనువుపోయి మళ్ళీ వచ్చింది.

* వెఱ్ఱిదైన కుక్క వేసారి దిరుగురా.

* వెఱ్ఱిపెయ్యకు తొఱ్ఱిపెయ్య తోడు.

* వెఱ్ఱిముండ వేడుక చూడబోతే, వెతక నిద్దరు, ఏడువ నిద్దరు.

* వెఱ్ఱిమొద్దుకేల వేదశాస్త్రాలు?

* వెఱ్ఱివాడి పెళ్ళాం వాడకల్లా వదినే.

* వెఱ్ఱివాడు ఏతాం తొక్కినట్లు.

* వెఱ్ఱివాడు వెఱ్ఱివాడు అంటే, వెక్కి వెక్కి ఏడ్చినాడట.

* వెఱ్ఱివాని చేతిరాయి తగిలెనా తగులును, తప్పెనా తప్పును.

* వెఱ్ఱి వేయి విధాలు, పైత్యం పదివేల విధాలు.

* వెలమ నీల్గు, బరపట గంజి, తెడ్డు తేరా దేవుకతిందాం.

* వెలమ మెచ్చిన ముచ్చట జెప్పు - అలిగిన ప్రాణహాని దెచ్చు.

* వెలమ చెలిమి కలలోకన్నా కలిమి వంటిది.

* వెలమ పొందు వెయ్యేండ్లు చేసినా కాసు వీసమైనా కానరాదు.

* వెలమల వితరణ, సాతాని శాస్త్రవాదము.

* వెలమలున్న ఊరు - కొంగలున్న మఱ్ఱి - ఒకటి.

* వెలమవారి పెండ్లికొడుకు మారడుగానేరడు, ఉన్నదంతా ఊడ్చిపెట్టు.

* వెలయాలి మాట - కలలోని మూట.

* వెల సులభం, ఫల మధికం.

* వెలిగొండవంటి తండ్రికంటే, ఏకులబుట్టవంటి తల్లిమేలు.

* వెలిచవుల్ గొనుకాంత వెరువదు నిందుకు.

* వెలిపొలమును, వెధవపిల్లను వదలకూడదు.

* వెలుగుకన్న దిక్కు వేరెవరున్నారు?

* వెలివాడలో వేదఘోష ఉంటుందా?


* వెలుగు నీడ, గ్రామం తోడు.

* వెలుగు లేకున్న చీకటి లేదు, చీకటి లేకున్న వెలుగు లేదు.

* వెలుగే చేనుమేస్తే కాచేవా రెవరు? (వెలుగు=కంచె, కర)

* వెలుతురుకట్టెల (పుల్లల) వెలుగని వెలిగించు కొంటారా? (వెలుతురుకట్టె= ఒక అడవిచెట్టు పుల్లలు, బెరడుతీసి వెలిగించిన చమురుబోసిన దివిటీవలె వెలుగుచుండును).

* వెలుపల వేడుక, లోపల కసపు.

* వెల్లకిత్తలా పడుకుని ఉమ్మివేస్తే (ముఖం)మీద పడుతుంది.

* వెల్లకిలా వేసి పొడిస్తే ఒక్క దెబ్బకే చస్తున్నదని సన్యాసుల మయిన మేమెందుకు చెప్పడం.

* వెల్లటూరిలో ఎద్దును, పరుచూరులో పడుచును ఇవ్వకూడదు.

* వెల్లుల్లి వనానికి జోరీగ, పాడూరికి దరిబేసి రాజులు (దరిబేసి= దర్ వేష్ అను ముస్లిం సన్న్యాసి గణము; నలుచదరపు రంగురంగుల పేలికలతో బొంత కుట్టుకొందురు. భిక్షగాడు లేక దరిద్రుడని భావము).

* వెళ్ళిపొమ్మంటే, పెళ్ళికి వెళ్ళుదా మన్నట్లు.

* వెళ్ళిపొమ్మంటే చూరుపట్టుకొని వ్రేళ్ళాడినట్లు.



**********:: వే ::**********

* వేగీవేగనమ్మ వేకువజామున ముట్టయితే, తెలివిగలమ్మ తెల్లవారుజామున ముట్టయిందట.

* వేగీవేగని పెసరపప్పు, వెనుకవచ్చిన పెండ్లాము రుచి.

* వేగుకు ముందు చీకట్లు దట్టమైనట్లు.

* వేటకాని ఇల్లు వెఱవక కుందేలు సొచ్చినట్లు.

* వేచని కందిపప్పు, అవివేకుని మెప్పు.

* వేటుకు వేటు, మాటకు మాట.

* వేడికోర్వలేనమ్మ సహగమనం చేస్తానన్నదిట.

* వేడినీళ్ళకు ఇల్లు కాలునా?

* వేడినీళ్ళకు చన్నీళ్ళు, చన్నీళ్ళకు వేడినీళ్ళు తోడయినట్లు.

* వేసేవి పులిగురకలు, మేసేవి గడ్డిపరకలు.

* వేస్తివిరా కన్నం అంటే, చేస్తివిలే కాపురం అన్నట్లు.

* వేస్తే మునగకొయ్య, తీస్తే చండ్రకొయ్య (చండ్ర=చాలా బాగ కాలేకొయ్య).

* వేళ్ళపై నీళ్ళుపోసినా కొసలకే (చెట్లకు).



**********:: వై ::**********

* వైదీకపు పిల్లీ! వ్రత్తిపలకవే అంటే, మ్ర్యావ్ మ్ర్యావ్ అన్నదట.

* వైదీకుని చేతి విడిమాయె వనిత బ్రతుకు.

* వైదీకి వైద్యంలో చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే.

* వైద్యం నేర్వనివాడు, వానకు తడియనివాడు లేడు.

* వైద్యుడా! నీ సంచీలో వేడినీళ్ళు ఉన్నవా అన్నట్లు.

* వైద్యుడి పెండ్లాముగూడా ముండమోసేదే అన్నాడట.

* వైద్యుడు మొదట తన వ్యాధిని పోగొట్టుకోవాల.

* వైద్యుడు రోగాలు కోరు, వైశ్యుడు కరువు కోరు.

* వైద్యుని పేరుచెప్పితే వ్యాధిపోవునా?

* వైద్యుని భార్యకే భగంధర రోగము.

* వైరాగ్యం ముదిరితే, వారవనితకూడా తల్లితో సమానం.

* వైరికి గానీ వడ్లు మొదగవు.

* వైష్ణవుని మెడలో రుద్రాక్షలు కట్టినట్లు.

* వైశ్యుల పెండ్లిలో వితరణలేదు.

* వైష్ణవులలో రామభద్రయ్య, శైవులలో వీరభద్రయ్య, స్మార్తులలో వట్టి భద్రయ్య.

* వైష్ణవులలో లింగయ్య ఉండడుగానీ, శైవులలో రామలింగయ్య ఉంటాడు (పేర్లు).



**********:: వ్య ::**********

* వ్యర్థమైన సొమ్ము వ్యర్థుల చేరురా.

* వ్యవసాయం వెఱ్ఱివాని (గుడ్డివాని) చేతి రాయి.

* వ్యవసాయం ఏలిననాటి శని, భార్య జన్మశని.



**********:: వ్యా ::**********

* వ్యాది దెలియలేని వైద్యుడేరికినేల?

* వ్యాధి పీడితుడు దైవచింతనచేయు.

* వ్యాధి రట్టు సంసారం గుట్టు.

* వ్యాధి వచ్చినవాడు వెఱ్ఱిబట్టినవాడు ఒకటి.

* వ్యాపారం చమురు వంటిది, కాబట్టే దాంట్లో మరేదీ ఇమడదు.

* వ్యాధికి మందుగానీ విధికి మందా?

* వ్యాధిహీనునికి పరవైద్యుని చెలిమేల?

* వ్యాపారం జోరుగా సాగిపోతున్నది, రెండోబఱ్ఱెను అమ్మి డబ్బు పంపమన్నట్లు.

* వ్యాపారి విత్తంబు వారకాంతలపాలు, కల్జువిత్తము రుంజుకాని పాలు (రుంజు=చర్మ వ్యాపారి).

* వ్యాస ప్రోక్తమా? పరాశర ప్రోకతమా? అన్నట్లు.



**********:: వ్ర ::**********

* వ్రతం చెడ్డా సుఖం (ఫలం) దక్కవలె.



**********:: వ్రా ::**********

* వ్రాత కరణమా? మేత కరణమా?

* వ్రాతగదే కూతురా! అంటే, కోతిమొగుడే అమ్మా అన్నట్లు.

* వ్రాత దైవమండ్రు, చేత పౌరుషమండ్రు.

* వ్రాత బలి గోరును.

* వ్రాత రాజ్యమేలాలని ఉంటే, గ్రహచారం (కర్మం) గాడిదల నేలమన్నదట (మేపమన్నదట).

* వ్రాత రానివాడు కోత (స)కరణం, వ్రాతా కోతా రానివాడు మేతకరణం.

* వ్రాత వెంతగాని వరమీదు దైవంబు.

* వ్రాసే వాణ్ణి, కోసేవాణ్ణి, గీసేవాణ్ణి నమ్మరాదు.