తెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది - నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది - రాయలసీమ నాది
సర్కారు నాది - నెల్లూరు నాది
అన్నీ కలసిన తెలుగునాడు - మనదే మనదే మనదేరా! || తెలుగు ||
ప్రాంతాలు వేరైనా - మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న - మన భాష తెలుగు భాషన్న
వచ్చిండన్న వచ్చారన్న - వరాల తెలుగు ఒకటేనన్న
మహాభారతం పుట్టింది రాజమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్నా - ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
పోచంపాడు ఎవరిది? నాగార్జునసాగరెవరిది?
మూడు కొండలూ కలిసి దున్నిన ముక్కరు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలే ఆరుకోట్ల తెలుగువారిది.
సిపాయి కలహం విజృంభించిన నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్కి జై
గాంధి నెహ్రూల పిలుపు నందుకొని సత్యాగ్రహాలు చేస్తాము
వందేమాతరం
స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తితో తెలుగువారికి ధీటు లేదనిపించాము
ఇంటిలోన అరమరికలు వుంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటే కనుగ్రుడ్డులు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు
