చేయెత్తి జైకొట్టు తెలుగోడా
చేయెత్తి జైకొట్టుతెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
సాటిలేని జాతి - ఓటమెరుగని కోట
నివురుగప్పి నేడు - నిదురపోతుండాది
జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా! || చేయెత్తి ||
వీర రక్తపుధార - వారబోసిన సీమ
పలనాడు నీదెరా - వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్ర పాపయ్య గూడ నావోడూ! || చేయెత్తి ||
కాకతీయ రుద్రమ, మల్లమాంబ, మొల్ల
మగువ మాంచాల నీ తోడ బుట్టినవాళ్ళే
వీరవనితలగన్న తల్లేరా!
ధీరమాతల జన్మభూమేరా! || చేయెత్తి ||
నాగార్జునుడి కొండ, అమరావతీ స్థూపం
భావాల పుట్టలో - జీవకళ పొదిగావు
అల్పుడను కావంచు తెల్పావు నీవు!
శిల్పినని చాటావు దేశ దేశాలలో! || చేయెత్తి ||
