కులముగలుగువాడు గోత్రంబు గలవాడు

bookmark

కులముగలుగువాడు గోత్రంబు గలవాడు
విద్యచేత విర్రవీగువాడు
పసిడిగలుగువాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం-
ఎంత పెద్ద కులం గోత్రం కలిగున్నవారైనా, ఎంత చదువుకున్నవారైనా, డబ్బున్నవారి చేతిలో కీలుబొమ్మలే!

ఏ కాలంలోనైనా ధనం కలిగినవాడిదే పైచేయి అన్నవిషయం ఈ వేమన పద్యం ద్వారా తెలుసుకోవచ్చు. కులంకాదు, గోత్రం కాదు, చదువుకున్న చదువు కాదు కేవలం ధనికవర్గమే రాజ్యమేలుతుందన్న విషయాన్ని కటువుగా "బానిసకొడుకులు" అంటూ చెప్పారు వేమనాచార్యులవారు. ఉన్నతమైన కుటంబంలో పుట్టినా, ఎంత విద్యగరచినా చివరకు ఎవరైనా డబ్బున్నవారిని ఆశ్రయించాల్సిందే. మాట చెల్లటమైనా, సమాజంలో గౌరవమైనా ధనంగలవారికే లభిస్తోంది. ఏదైనా సందర్భంలో ఇతరులకు గౌరవ ప్రతిష్టలు లభించినా అది తాత్కాలికమే. ధనవంతుల మాటే చెల్లటం జరుగుతోంది. అధికారం చేతిలో ఉన్నవారి మాట చెల్లుతుంది కదా అనుకుంటే, ఆ అధికారం చేతచిక్కటానికి, దాన్ని నిలబెట్టుకోవటానికి కూడా ధనం కావలసిందే.

"పెద్దై ఏం చేస్తారురా?" అని ఒక మేస్టారు విద్యార్థులను అడిగితే పోలీసవుతానని, ఒకరు ఆఫీసరవుతానని, కలెక్టరని, గవర్నరని, డాక్టరని, ఇంజినీరని ఇలా రకరకాలుగా వారి లక్ష్యాలను తెలియజేస్తే, ఒక విద్యార్థి మాత్రం, నేను వీరందరి చేతా పనిచేయించుకుంటానన్నాడట.