వెన్నెల గుజ్జులు
వెన్నెల రాత్రులందు పసిబిడ్డలను ఎత్తుకొని చందమామ ముచ్చట్లు
చెప్పుతూ ఆరబైట అన్నము తినిపించడము తల్లులకు అలవాటు.
"అమ్మా, చూడు. చందమామలో ఒక ముసలమ్మ పొయిమీద
కుండపెట్టుకొని అన్నము వండుకొంటూ కూర్చున్నది! చూచావా!
అదుగో! నల్లగా కనపడు తున్నది!" అంటారు. ఈ పదము చెప్పుతారు.
చందమామ రావె! జాబిల్లిరావె!
కొండెక్కిరావె! గోగుపూలు తేవె!
ఒలవనిపండు ఒళ్లోఉంచుకొని,
ఒల్చినపండు చేత బుచ్చుకొని,
వెండిగిన్నెలో వెన్న పెట్టుకొని,
పమిడిగిన్నెలో పాలు పోసుకొని,
అమ్మా, నువ్వూ తిందురుగాని!
అట్టా అట్టా రావె!
చందమామా!
ఇంకా ఈ పద్యములుకూడా చెప్పుతారు...
వెండిగిన్నెలోన వెన్నయు నెయి పోసి,
పమిడిగిన్నెలోన పాలు పోసి,
చందమామరావె! జాబిల్లిరావె! మా
చిన్నిబిడ్డతో భుజింతుగాని.
జేజేలకును బువ్వ! శివునియౌదల పువ్వ!
జాబిల్లి రాగదే చందమామ!
మెండుచీకటి దొంగ! మెఱయుచుక్క బొజుంగ?
జాబిల్లిరాగదే చందమామ!
చిగురుకైదువుకామ చెలగురావుతుమామ!
జాబిల్లిరాగదే చందమామ!
చిన్నయన్నకు శ్రీరఘుశేఖరునకు
వెండిగిన్నియలోపల వెన్నపోసి,
పమిడిగిన్నియలోపల పాలుపోసి,
చాల దినిపించి పోగదే చందమామ.
