మన ఐక్యత కాపాడాలి

bookmark

తెలుగు పతాకం యెగురని దిశయే లేదు
తెలుగు దివ్వె వెలుగనట్టి దిశయే లేదు
తెలుగు వెలుగు చేరలేని దేశం లేదు
తెలుగు వెలుగు దూరలేని కోశం లేదు
వేయి స్తంభముల గుడిని వెలయించిన చేతులు
వేయి యేండ్ల మన గాధలు వినిపించే గీతలు
కాకతి రుద్రమను మరువగలుగునెవరు? సోదరీ
రాయల పౌరుషము మరువరాదెన్నడు సోదరా!
నాగార్జునాచార్య నవ బోధనలోన
నరుల నాగరకతయే నాట్యమాడేనులే
నందికొండ శిల్పాలకు నతు లొనరించాలి
సుందరమగు రామప్పకు వందే అనాలి
గోదావరి తీరంలో కో అంటే చాలును
నా దేశం వైభవము నాదాలై వినబడును
కృష్ణానది తరంగాల తృష్ణతీర్చు సుధాఝురులు
నాగార్జున సాగరాన నాట్యమాడు తరంగాలు
తిరుపతి కొండకు పోయి తిరుమలేశు పూజిస్తే
పరమ భాగవతుల కిహము పరము కరతలా మలకము
శ్రీశైలం మల్లన్నను సేవిస్తే చాలును
చింతలన్ని తొలగిపోయి జీవితమే విరబూయును
నన్నయ పద్యమ్మొక్కటి నాల్క మీద ఉన్న చాలు
అన్ని విద్య లొకసారే ఆకళించినట్లును
తిక్కన పద్య మొక్కటి చక్కగ చదివిన చాలు
తెలుగు జాతి నుడికారము తెలిసికొన్న యటులన్
పోతన పద్య మొక్కటి ప్రీతిగ చదివిన చాలును
అమృతమునే రుచిచూచిన ఆనందము కలుగును
విశ్వదాభిరాముడైన వేమన ఆటవెలదిలో
విశ్వమెల్ల ఇమిడిపోయి వేదాంతం విరియును
త్యాగరాజ కీర్తనతో తాదాత్మ్యం పొందితే
సంగీతం హృదయంలో జడివానై కురియును
కలకాలం మన ఐక్యత కాపాడాలి
తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టాలి