పాడవోయి భారతీయుడా
పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా
నేడే స్వాతంత్ర్యదినం - వీరుల త్యాగఫలం ||2||
నేడే నవోదయం - నేడే ఆనందం || పాడవోయి ||
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయీ ||2||
సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయ మనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులా || ఆగకోయి ||
ఆకాశం అందుకునే ధరలొక వైపు అదుపు లేని నిరుద్యోగులింకొక వైపు ||2||
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకొన్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్ధితి ఎదిరించవోయి ఈ పరిస్ధితి || కాంచవోయి ||
పదవీ వ్యామోహాలు, కులమత బేధాలు, భాషా ద్వేషాలూ చెలరేగే నేడు ||2||
ప్రతి మనిషి మరి యొకని దోచుకొనే వాడే తన సౌఖ్యం, తన స్వార్ధం చూసుకునేవాడే || పాడవోయి ||
నవ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం ||2||
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం పాడవోయి భారతీయుడా!!
