తెలుగు సామెతలు-బ

bookmark

* బంకచెక్కలు, జింక తోలు,పాయిల కూర.

* బంగారం కొద్దీ సింగారం.

* బంగారం పోయిన తర్వాత బట్ట చుట్టమా?

* బంగారం పట్టితే మన్ను; మన్ను బట్టితే బంగారం అయినట్లు (దురదృష్ట అదృష్టముల స్థితి).

* బంగారపు పళ్ళానికైనా గోడ చేర్పుండ వలెను.

* బంగారముంటే సింగారాని కేమి (కొదువ) తక్కువ?

* బంగారమునకు తావి అబ్బినట్లు.

* బంగారు కరుగను వెలిగారం తప్పనట్లు.

* బంగారుకే రంభ చిక్కుతుందా?


* బంగారు గాలానికి బంగారు చేపలు పడవు.

* బంగారు చెప్పులైనా (ముచ్చెలైనా) కాళ్ళకే తొడగాలి.

* బంగారు పొల్లునది గానీ, మనిషి పొల్లు లేదు.

* బంగారు బాగుగా పది వన్నెగాకుంటే అంగలార్చుచు బొచ్చు (కోమటి) వాడుకోనేల?

* బంగారు మనిషి ఊరేగటానికి వెడితే, ఇదే సందని భజంత్రీలు పారిపోయారట.

* బంగారు వంటి కోమటి సంగీతముచేత బేరసారము లుడిగెన్.

* బంగు తిన్న కోతి వలె.

* బండకొయ్యకు గుద్ది చెప్పినట్లు.

* బండ తీసి, గుండు పెట్టినట్లు.

* బండన్న పెండ్లికి బడితే బాజా.

* బండ్రవాండ్రు ముందు దండంబు లిడుదురు.

* బండవానికి పిండి యోచన ఏమిటి?

* బండారంలేని కోమటి బాటలు బుద్దిచ్చుకున్నాడట.

* బండివాటు బడ్డోడు వెఱ్ఱోడు.

* బండెక్కి సివాలాడుతూ బావగారు చూస్తారని భయపడ్డట్లు.

* బండెడు ధనమిచ్చినా బావమరది లేని చుట్టరికం పనికిరాదు.

* బంతికే రావద్దంటే విస్తరాకు తెమ్మన్నట్లు.

* బంతిలో చిక్కింది భైరనలోకి.

* బందరు నాయాళ్ళ బడాయేగానీ, అడపంలో (సంచీలో) ఆకువక్క లేదు (పోక పలుకే లేదు).

* బందరు బడాయి, గుంటూరు లడాయి.

* బందరు మూల మెరిస్తే బక్కగొడ్డును అమ్మిస్తుంది (వాన లెక్కువగును).

* బందిపోటు తరిమినా, గొఱ్ఱెలమంద లోనికి పోరాదు.

* బందిపోటుదొంగ ప్రాణమునో ధనమునో హరిస్తే, పెండ్లి ఈ రెంటినీ హరిస్తుంది.

* బందెలో పాయసం కంటే బయట సజ్జరొట్టె మేలు.

* బందెడు పచ్చి, కోడలు కొత్తా లేదు (బందెడు, బందారు= ఒక అడవి గుబురుచెట్టు, వాపులకు కట్టుదురు).

* బంధువయితే మాత్రం బంధాలు తొలగిస్తాడా?

* బంధువుడవు సరెగానీ పైరులో చేయి పెట్టవద్దు.

* బంధువుతోనైనా పాలి వ్యవసాయం కూడదు.

* బంధువులంతా ఒక దిక్కు, బావమరిది ఇంకొక దిక్కు.

* బంధువులకు దూరం - బావికి చేరువ.

* బక్కనాగు పయనం బోతే నక్కలన్ని గుస గుసలాడె.

* బక్కవానికి బలిసినవాడు బావ, బలిసిన వాడికి బక్కవాడు బావ.

* బగబగమను వాని పంచన నుండవచ్చును గానీ, నాలిముచ్చు నట్టింట నుండరాదు.

* బగుళ్ళపనికి బరంతు లేదు.

* బచ్చన కోలలు, రిచ్చన గిల్లలు.

* బజారున పోయేవాడిని అమ్మా అంటే, ఎవరికి పుట్టావురా కొడుకా అన్నట్లు.

* బజారు బత్తెం, బావి నీళ్ళు.

* బజారులో కోట్లాడాలి, బంతిలో భుజించాలి.

* బట్ట కాలితే సెట్టి విడుస్తాడా?

* బట్టా చాటు పుండు బావగారి వైద్యం.

* బట్టతలకు పేలు పట్టినవన్నట్లు.

* బట్టతలకు మోకాళ్ళకు ముడి వేసినట్లు.

* బట్టతలమ్మ పాపిట తీయమన్నట్లు.

* బట్టప్పు, పొట్టప్పు నిలువవు.

* బట్టలో పేలాలు వేయించినట్లు.

* బట్టవిప్పి నీళ్ళుపోసుకుంటూ, బావగారు వచ్చారని నిటారున నిల్చుందట.

* బట్టా(పా)బాతా డౌలే కానీ, నా బట్టదగ్గర బొట్టుకూడా లేదన్నట్లు (డౌలు=డంభము).

* బడాయి ఏమి బాపనమ్మా అంటే, అమలుదారు నా అల్లుడాయెగదా అన్నదట.

* బడాయి ఏమిరా అన్నయ్యా? అంటే, పైసా లేదుర తమ్మయ్యా అన్నాడట.

* బడాయికి బచ్చలికూర, తినకపోతే తోటకూర.

* బడాయికి బయట పడుకుంటే, బక్క నరాలు యిక్కలాక్కు వచ్చాయంట.

* బడాయికి బావగారు చస్తే, ఈడ్వలేక ఇంటివారందరు (ఇంటిల్లిపాది) చచ్చారు.

* బడాయికోరు బచ్చే, కూటికిలేక చచ్చే.

* బడాయి గాలికి పోతే, గుడ్డు నేలకు ఆనిందట.

* బడాయి బండిమీద పోవడమేగాని, బత్తా (బత్తెమునకు) నికి నూకలు లేవు.

* బడాయి బండెడు, బట్టలు సందెడు.

* బడాయి బండెడు, బత్తెం గిద్దెడు.

* బడాయి బత్తెన్న కూడులేక చచ్చెన్న.

* బడాయి బచ్చలి కూరకు ధడా చింతపండు.

* బడాయి బారెడు, పొగచుట్ట మూరెడు.

* బడికి బత్తెం, మడికి గెత్తెం (గెత్తెం=ఎరువు).

* బడితె గలవానిదే బఱ్ఱె.

* బడిలేని చదువు - వెంబడిలేని సేద్యం.

* బడివారపు నక్క కుక్కల పొలానికి పోయిందట.

* బడి(బరి) విడిచిన ముండ బజారుకు పెద్ద.

* బడేసాయిబు గడ్డం బారెడైతే నేమి? మూరెడైతే నేమి?

* బడేసాయిబును జోస్యులు, తొలిఏకాశి ఎప్పుడు అని అడిగినట్లు.

* బతకలేక బడిపంతులు.

* బతకలేనమ్మ బావిలో పడి చచ్చిందట.

* బతకలేని వాడు బావిలో పడితే, తియ్యబోయినవాడు కయ్యలో పడ్డాడట.

* బతికి(బ్రతికి)ఉంటే గరిటెడు పాలు లేవుగానీ, చస్తే సమాధిపై ఆవును కట్టేస్తా అన్నట్లు.

* బతికిచెడిన వారితో బందుత్వం చేయవచ్చును గానీ, చెడిబ్రతికిన వారితో చేయరాదు.

* బతికితే బలిజోడు, లేకపోతే బోగమోడు.

* బతికిన (బ్రతికిన) బతుక్కి భగవద్గీత పారాయణమా?

* బతికిన బతుక్కు ఒక పంది సాకుడా?

* బతికితే అతిసారం, చస్తే కలరా అన్నట్లు.

* బతికితే భూదానం, చస్తే గోదానం.

* బతికితే వైద్యుడు బ్రతుకుతాడు, చస్తే బ్రహ్మణుడు బ్రతుకుతాడు.

* బతికి పట్నం చూడాలి, చచ్చి స్వర్గం చూడాలి.

* బతికే బిడ్డయితే పాసుకంపు కొడుతుందా?

* బతుకంత (బ్రతుకంత) భాగ్యం లేదు.

* బతుక నేరని బిడ్డ బారెడుండు.

* బతుక లేక బాగోతం (భాగవతం).

* బతుకలేనమ్మ నీళ్ళులేని బావిలో నిచ్చన వేసుకొని దూకిందట.

* బతుకు తక్కువైనా బడాయి ఎక్కువ.

* బతుకు లెన్నాళ్ళు? భాగ్యా లెన్నాళ్ళు?

* బత్తె మున్నన్ని నాళ్ళు బ్రతుకులు.

* బత్తెమెక్కడో సత్య మక్కడ.

* బదులు మనిషి ఉంటే, పగలు తలనొప్పి.

* బనగానపల్లి ఉరుసు, నా వెంట రావే సరసు.

* బయట తన్ని, ఇంట్లో కాళ్ళు పట్టుకున్నట్లు.

* బయట పులి, ఇంట్లో పిల్లి (భార్య ఎదుట)

* బయటకి ఇంపు, లోపలికి కంపు.

* బయటకి పోయిన చోట గుద్ద (ముడ్డి) మరచివచ్చినట్లు.

* బయటి కొకటి, లోపలి కొకటి (మాట).

* బయటివాడు చూడుగేదంటే, ఇంటివాడు గొడ్డుగేదె అంటాడు.

* బయల చిత్రము వ్రాసినట్లు.

* బయిలున్నంత చదివె బయ్యన్న (బయిలు=పుస్తకాలు).

* బయిలో ఉన్నంత బయ్యన్న గీకె.

* బరిగ పంట - కడుపు మంట.


* బఱక సేద్యం - తురక నేస్తం.

* బఱ్ఱె పెంట తిన్నా, పాలు కంపు కొట్టవు.

* బఱ్ఱెకొమ్ము అంటే, ఇఱ్ఱి కొమ్ము అన్నట్లు.

* బఱ్ఱెకో బాంచ, గుఱ్ఱానికో సైను (బంచె= బానిస; సైను= మాలీషు చేసేవాడు).

* బఱ్ఱె చవలం, బందె ముచ్చెవలం.

* బఱ్ఱ్ ఎచస్తే పాడి బయట పడుతుంది.

* బఱ్ఱె-దూడ ఉండగా గుఱక గుంజకు వస్తుందా? (గుఱక=పశురోగం).

* బఱ్ఱెదూడ వద్ద, పాత అప్పులవాడి వద్ద ఉండరాదు.

* బఱ్ఱె పాతిక, బందె ముప్పాతిక.

* బఱ్ఱె పిల్లికాలు తొక్కితే, పిల్లి ఎలుకపై మీసాలు దువ్వుందట (కళ్ళెఱ్ఱ జేసిందట).

* బఱ్ఱె పిల్లకు బనారసు చీర

* బఱ్ఱెలు తినని కూరగాయలు బాపలకు దాన మన్నట్లు.

* బలం ఉడిగినా, పంత ముడగరాదు.

* బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చచ్చినట్లు.

* బలవంతాన పిల్లనిస్తామంటే, కులమేమి? గోత్రమేమి అని అడిగినాడట.

* బలవంతుడు సొమ్ముగాక బాపడి సొమ్మా? (సొత్తా).

* బలవంతుని చెయ్యి పడితే, బావి ఐనా చూసుకోవాలి, చంక అయినా చేరాలి.

* బలవంతపు మాఘస్నానం.

* బలవంతపు బ్రాహ్మణార్థం.

* బలిజ చుట్టంకాడు, బడ్డు అయుధం కాదు.

* బలిజ పుట్టుక పుట్టవలె, బతాయిబుడ్డి కొట్టవలె.

* బలిజవారి పెండ్లికి జుట్టుతో సహా ఎరువు.

* బలిజల విత్తము పట్టెదాసరి పాలు, గొల్ల విత్తము పిచ్చుగుంత పాలు.

* బలిమిలేని వేళలో పంతం చెల్లదు.

* బలిస్తే గోకి చంపుతారు, చిక్కితే నాకి చంపుతారు.

* బలుసు పండితే గొలుసుల్లా కంకులు (వరి).

* బలుసు లేని తద్దినము, బులుసు లేని యఙ్ఞమున్ను లేవు (బలుసు=ఒక ఆకుకూర; బులుసు=బులుసు పాపయ్య, బులుసు అచ్చయ్య శాస్త్రులు వేదవేదాంత వేత్త, విశ్రుతులు).

* బల్లి పలికిందని బావ పక్కలో చేరిందట.

* బసవ దేవునికి బడితె పూజ.

* బహుతిండి బహునాశనం అన్నారు.

* బహు నాయకము, బాల నాయకము, స్త్రీ నాయకము (చెడుపు).



**********:: బా ::**********

* బాంచెను వెంకటమ్మా అనాలి కాలం తప్పినప్పుడు.

* బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు.

* బాగైన సొమ్ములెన్ని ఉన్నా మంగళసూత్రమగునా?

* బజారు రంకుకు పంచాయతీ చెప్పు లంజలు వీరమాతలైరి.

* బాజాల సందడిలో మంగళ సూత్రాన్ని మరచారట.

* బాడి(డు)గ గుఱ్ఱానికి సుడులు పట్టిచూచినట్లు.

* బాతాకానీ వానికి బారనా, నాకూ బారనానేనా? (బారనా=పన్నెండణాలు).

* బాదరాయణ సంభందం.

* బాదేపల్లి సేట్లు, లెక్కలు చూస్తే తూట్లు.

* బాధకొక కాలము, భాగ్యాని కొక కాలము.

* బాపనవాడి కొలువు, తెల్లగుఱ్ఱపు కొలువు కష్టం.

* బాపన వావి బందవావి.

* బాపన సేద్యం బడుగుల నష్టం.

* బాపన సేద్యం బత్తెం చేటు, కాపుల చదువులు కాసులు చేటు.

* బాపన సేద్యం బ్రతకటానికీ కాదు, బ్రతికించటానికీ కాదు.

* బాపన సేద్యం - బాల వైద్యం.

* బాపనోళ్ళ కోపం - వరిగడ్డి శాకం.

* బాపలలో చిన్న, బేస్తలలో పెద్ద.

* బాపలు తప్పినా వేపలు తప్పవు, వేపలు తప్పినా ఏరువాక పున్నమ తప్పదు.

* బాబుకు లేక బఱ్ఱెతో ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పెళ్ళో అని అఖోరించాడట.

* బారకల్ల మీద బట్ట పడ్డట్టు.

* బారకావడివలె పడ్డావు, నీవెవడురా, మా ఇంటి దేవరకు మ్రొక్కను?

* బారతకతలోన బాలరాజొకడు కుంబకర్నునిబట్టి (కుత్త) గుద్దసించిన వైనం తెలియదా అన్నాడట.

* బారు బంగాళా, కొంప దివాళా.

* బారెడు చుట్టు అయినా బాటన పొమ్మన్నారు.

* బాల పొంగు - పాలపొంగు.

* బాలల తుమ్ము, బాలెంత తుమ్ము మంచివి.

* బాల వాక్కు(వాక్యం) బ్రహ్మ వాక్కు(వాక్యం).

* బాలుర దీవెనలు బ్రహ్మ దీవెనలు.

* బావకు మరదలు పిల్లపై ఆశ.

* బావమరిదికంటే మించిన బంధువు లేడు.

* బావమరిది బ్రతుక గోరును, దాయాది చావ గోరును.

* బావమరుల ప్రక్కన కూర్చోవటం ఎట్లా అని, దూరంగాపోయి తురకోడి పక్కన కూర్చున్నదట -కొత్త పెండ్లికూతురు.

* బావలేని కోడలు బహుభాగ్యశాలి, మరి(ఱ)ది లేని కోడలి మరీమంచిది.

* బావా! అని చూడబోతే, రావా అని కొంగుపట్టుకున్నాడట.

* బావా! నీభార్య ముండమోసిందంటే, మొఱ్ఱో అని ఏడ్చాడట.

* బావా బావా అంటే పక్కలోకి రమ్మనాడట.

* బావికింద దిన్ని బ్రతికినవాడు, చెఱువుకింద దున్ని చెడినవాడు లేడు.

* బావి తప్పినవాడు, బడిం దిరిగినవాడు ఒకటే.

* బావి త్రవ్వగా భూతం బయట పడినట్లు.

* బావిలో ఏరిగేవాడికంటే బావిపక్కన (అంచున) ఏరిగేవాడు మేలు.

* బావిలోతు చూడగలంగాని, మనిషి మనసులోతు చూడగలమా?

* బావిలోని కప్పకు, గానుగ ఎద్దుకు అవే లోకాలు.

* బావురుపిల్లికి చిలుకపై మొగమాటమా?

* బాషికం మొదలు భజంత్రీల వరకు బదులుతో పెండ్లి జరిపినట్లు.

* బాస(బావి) బిస తప్పిలే పట్టరా తంగేళ్ళు.

* బాహ్య ధార్మికుడు, అంతరంగిక పిశాచము.



**********:: బి ::**********

* బిగువులేని కచ్చ, బీగములేని ఇల్లు.

* బిగువైన ఎద్దుకే బిగువైన సేద్యం.

* బిచ్చం బిడబిడ, కుండలు లొడలొడ.

* బిచ్చగాణ్ణి పొమ్మన్నా అత్త చెప్పాలి, కోడలు పంపాలి.

* బిచ్చగాని గుడిసె, మా అక్క చూచి మురిసె.

* బిచ్చపు కూటికి పేదరికమా?

* బిచ్చపు కూటికి శనేశ్వరం అడ్డం పడ్డట్లు.

* బిచ్చము వేయకున్న మానె, కుక్కని కట్టివేయమన్నట్లు.

* బిచ్చానికి పోయినా బిగువు తప్పలేదు, దుప్పటి పోయినా వల్లెవాటు తప్పలేదు.

* బిచ్చానికి వచ్చినవాడు, అచ్చంగా కాకపోయినా ఆ పూటకు చుట్టమే.

* బిడుగుచెడ్డ ముండ చీటికి ముగ్గు పెట్టిందంట.

* బిడ్డయినా పడ్డయినా పుట్టాక విడిచిపెడతామా?

* బిడ్డ ఎదిగితే కుండ ఎదుగుతుంది (వంటకుండను పెద్దది చేయాలనుట).

* బిడ్డ చచ్చినా తొట్లమర్లు ఉడుగలేదు.

* బిడ్డ చచ్చినా పీతికంపు (పురిటికంపు) పోలేదు.

* బిడ్డ చచ్చినా బారసాల బాగా జరిగింది.

* బిడ్దను దించి లోతు చూసినట్లు.

* బిడ్డ, పాము కఱచి చచ్చి ఏడుస్తుంటే, విషపురుగులం - మా జోలికివస్తే కరవక మానుతామా - అన్నదట అప్పుడే బయటపడిన ఏలికపాము.

* బిడ్డ బావిలో పడ్డాడంటే చద్దికూడు తినివస్తానన్నాడట.

* బిడ్డ ముద్దయితే పియ్యి ముద్దవుతుందా?

* బిడ్డలను కన్నమ్మా, బిక్షము పెట్టినమ్మా చెడరు.

* బిడ్డలేని ఇంటికి ఆవుదూడ ముద్దు, ఏమీలేని ఇంటికి ఎనుముదూడ ముద్దు.


* బిడ్డలేని ముద్దు, వానలేని వరద.

* బిడ్డ వచ్చినవేళ, గొడ్డూ వచ్చినవేళ. (బిడ్డ=కోడలు).

* బిడ్డసంగతి మీగాళ్ళ వాపే తెలుపుతుంది.

* బిడ్డలుగల తండ్రు లెందరో ఉన్నారుగానీ, తండ్రిగల బిడ్డలు చాలా తక్కువ.

* బిత్తరి బిడ్దను కంటే, ఎలుక ఎత్తుకపోయి వెన్నుకుప్పలో (వెన్నుగాడిలో) పెట్టిందట.

* బియ్యం దంచినదానికి బొక్కిందే దక్కుట.

* బియ్యం దంచినమ్మకు బొక్కిందే కూలి.

* బియ్యపు బస్తాలు పోతుంటే లేదుగానీ, చవిటి చేటలకు వచ్చిందా?



**********:: బీ ::**********

* బీడున కురిసిన వాన - అడవిన కాచిన వెన్నెల.

* బీదకూటికి బిక్క దేవుడు.

* బీదలకేల బోగుగుడి పెద్దరికము, పెట్టబీరము? (బోగుబడి=వితరణలేని వ్యయంతో సంసారి తిరులేనివాడు; పెట్టబీరము=స్త్రీల (పెంటి) పౌరుషము).

* బీద బలిసి బందికా డయినట్లు.

* బీదమొగంవాడా! నీ బిడ్డ పెళ్ళి ఎప్పుడంటే, మొద్దుమొగంవాడా మొన్ననే అయ్యింది అన్నాడట.

* బీదవాడు బిచ్చపువానికి లోకువ.

* బీదవానికి మాట ఈరాదు, కలిగినవానికి చోటు ఈరాదు.



**********:: బు ::**********

* బుక్కెడు తిన్నమ్మ బూరుగు (బూరగ) మ్రాను, చారెడు తిన్నమ్మ చెక్కపేడు.

* బుగతోరింట్లో పెళ్ళి, బుగ్గలు తిప్పకు మల్లి.

* బుచ్చిరెడ్డి అనె భూతానికి రామిరెడ్డి అనే రక్షరేకు (రేఖ).

* బుట్టలో పామువలె (కుండలో పామువలె).

* బుడ్డ ఎంతపెద్దదైనా ముక్కాలుపీట కాదు, బడ్డు ఆయుధం కాదు.

* బుడ్డకు, భూతానికి ఒకే మంత్రమా?

* బుడ్డగోచి కన్నా మించిన దారిద్ర్యంలేదు, చావుకన్నా మించిన కష్టం లేదు.

* బుడ్డది చిక్కినా కష్టమే, బలిసినా కష్టమే. (బుడ్డది=మరుగుజ్జుది)

* బుడ్డను నమ్మి ఏటిలో దిగినట్లు.

* బుడ్డోడి మంత్రము, బూడిదలో ఉచ్చ ఒకటి.

* బుధవారం పుట్టినదున్న భూమిని దున్నినా, తొక్కినా పొంగి పొంగి పండుతుంది.

* బుధవారమ్నాడు పులిగూడా బయలుదేరదు (బయటకి తలబెట్టదు).

* బుద్ధిగల (బుద్ధిమంతుల) జుట్టు భుజాలు దాటదట.

* బుద్ధి సెప్పువాడు గుద్దిన మేలయా.

* బుద్ధి భూములేలా లంటే, కర్మ (రాత) గాడిదలను కాస్తానంటుంది.

* బుద్ధి భూములేలుతుంటే అదృష్టం అడుక్కతింటున్నది.

* బుద్ధిమంతుడని సద్ది కడితే, బొండ్రాయి దగ్గఱనే భోంచేసినాడట.

* బుద్ధి మరలకున్న రద్దె కెక్కును.

* బురదగుంటలో పంది వెలె.

* బురద మెచ్చే పంది పన్నీరు మెచ్చునా?

* బురదలో దిగబడ్డ ఏనుగును బొంతకాకి అయినా పొడుస్తుంది.

* బులుపు తీరినగాని వలపు తీరదు.

* బుఱ్ఱుపిట్ట ఏడుగాండ్ల ఎద్దులను నిలిపేసినట్లు (నిలవేసినట్లు) (బుఱ్ఱుపిట్ట=చిన్నపిట్ట).



**********:: బూ ::**********

* బూకటికి బుద్ధిలేదు, వేకటికి సిగ్గులేదు.

* బూచీలకు బెదరునా బుగుడూరు సంత.

* బూటకానికి బుడ్డ దిగితే, ఆవిలిస్తే అవిసిపోయిందట.

* బూటాలకం దాసరికి బుఱ్ఱనిండా నామాలే. (మధ్య వైష్ణవునికి నామములు పెద్ద).

* బూడిదలో చేసిన (పోసిన) హోమం వలె.

* బూడిదలో పోసిన పన్నీరు బుడబుడ (వలె).

* బూతులేకున్న నీతి లేదు.

* బూనాచి మాటలు బూడిదకు కూడా రావు.

* బూబులు నాకుతుంటే నవాబుకు నాట్యాలా?

* బూబులే నాకుతుంటే పీర్లకు మహానైవేద్యమా?

* బూరుగ చెట్టంత పొడవుగా ఎదిగినా చిలుకకు ఫలవృత్తి కలుగబోదు.

* బూరె దర్శనం బువ్వ కోసమే.

* బూరు(ర)గ పండును నమ్ముకొనిన చిలుకకు దూదే దక్కినట్లు.

* బూర్లెగంప కాడ పొర్లు దండాలు.



**********:: బె ::**********

* బెండ్లు మునిగి గుండ్లు తేలినట్లు.

* బెడసి ముందుకు పడడు, జడిసి వెనక్కు పడడు.

* బెత్తలకు బేడల చారు, మాయింటిలో చింతగుగ్గిళ్ళు.

* బెద(ది)రించి బెండకాయ పులుసు పోసినట్లు.

* బెదరించి బెదరించి బెల్లపు కుండకు తూటు పొడిచిందట.

* బెల్లం అని అరచేత వ్రాసి నాకిన తీపగునా?

* బెల్లమున్న చోటే ఈగలు ముసిరేది.

* బెల్లపు పిళ్ళారికి ముడ్డిగిల్లి నైవేద్యం పెట్టినట్లు.

* బెల్లపు పొయ్యికి ఈగలే నిదర్శనం.

* బెల్లపు వినాయకుని ముడ్డిగిల్లి నైవేద్యం పెట్టినట్లు.

* బెల్లమని అరచేత వ్రాసి నాకితే నోటికి తీపి కలుగునా?

* బెల్లము ఉందని మోచేతిదాకా నాకినట్లు.

* బెల్లము ఉండా అంటే అల్లము ఉంది అన్నట్లు.

* బెల్లము ఉన్నంతసేపే ఈగలు ముసిరేది.

* బెల్లము కొట్టిన గుండ్రాయి వలె.

* బెల్లము పారవేసి చెయ్యి నాకినట్లు.

* బెల్లము వండిన పొయ్యి - ఇంగువ కట్టిన గుడ్డ.

* బెస్త పెగ్గెలు - ఊబమగని విరదాళ్ళు (విరదాళ్ళు=వీరత్రాళ్ళు).



**********:: బే ::**********

* బేగడరాగం మీగడతో సమానం.



**********:: బొ ::**********

* బొంక నేర్చి, ఱంకు నేర్వాల.

* బొంకరా గురవా అంటే, గురజాల దోమలు గురిగింజ లంతేసి అన్నాడట.

* బొంకరా బొంకరా పోలుగా అంటే, ఎద్దు గిట్టలో ఏడు చావిడాలు (చవిడాలు) అన్నాడట. (చవిడాలు=తాటిఆకు చేపలు ఎండబెట్టిన సముద్రపు చేపలు).

* బొంకరా బొంకరా పోలుగా అంటే, టంగుటూరి మిరియాలు తాటికాయలంటేసి అన్నాడట.

* బొంగలు తిన్న నోరు, ఆడిపోసుకున్న నోరు ఊరుకోవు.

* బొంగు లొట్టయినా, క(గ)ణుపు గట్టి.

* బొండు (బొద్దు) మల్లెలు బోడిముండ కెందుకు?

* బొంత కుట్టుకున్నవాడు కప్పుకోలేడా?

* బొందల కుంటకు నల్లేరు మోసినట్లు.

* బొక్కలో (బొరియలో) నిద్రబోయే నక్క కలలో తనవాతబడే కోళ్ళను లెక్కబెట్టుకొన్నట్లు.

* బొక్కలో పిల్ల, డొక్కలో పిల్ల.

* బొక్కినలో కొఱకంచు వలె.

* బొగ్గు పాలుగడుగ పోవునా నైల్యంబు.

* బొగ్గులకై కల్పతరువు పొడిచినట్లు.

* బొగ్గులలో మాణిక్యం వలె.

* బొగ్గులలో రామచిలుక వలె.

* బొచ్చు కాలిస్తే బొగ్గులగునా? (బూడిద అగునా?)

* బొటనివేలికి సున్నమైన దేమయా? అంటే, బోర్ల పడినానులే అన్నాడట.

* బొట్టి కట్టితేగానీ ముండ మోయదు.

* బొట్టు పసే గానీ బోనం పస లేదు.

* బొట్టుబొట్లాకొండ, బోనీలకొండ. నెమిలమ్మ గ్రుడ్లయితే నేనెరుగనమ్మ.

* బొద్దాకు తింటే బుద్ధి పెరుగునన్నట్లు.

* బొమ్మకు మ్రొక్కినా నమ్మక ముండవలె.



**********:: బో ::**********

* బోగంవీధి ఈటుబోయిందంటే కోమట్లంతా గోచులు సర్దుకున్నారట.

* బోగంవీధి కొల్లబోయిందంటే, సన్నాసులు గోచులు విప్పుకొని బయలుదేరినారట.

* బోగందాని చళ్లకు, సంత సొరకాయకు గోటిగాట్లు ఎక్కువ.

* బోగందాని తల్లు చస్తే అందఱూ పరామర్శించే వాళ్ళేగానీ, బోగందే చస్తే తొంగిచూచేవాళ్ళుండరు.

* బోగముదాని వలపు, బొగ్గు తెలుపు లేదు.

* బోటికి నీటూ - కూటికి చాటు.


* బోడితలకు బొండు (బొద్దు) మల్లెలు ముడిచినట్లు.

* బోడితలకు, బొటనివేలికి ముడి పెట్టినట్లు.

* బోడి పెత్తనం - కోడి కునుకు (ఎంతోకాలం సాగవనుట).

* బోడి పెత్తనం - తంబళ్ళ దొరతనం.

* బోడినెత్తిన టెంకాయ కొట్టినట్లు.

* బోడిమాను గాలికి మిండడు.

* బోడిముండకు తలసుళ్ళు వెదకినట్లు.

* బోడెద్దుకు పోట్లు మప్పినట్లు (మరపినట్లు).

* బోదనం కొట్టితే రాజసం పండును.

* బోనులో పడ్డ సింహం వలె.

* బోయవాది కొక్కడే ప్రభువా/ బోగందానికి ఒక్కడే మగడా?

* బోలెడు తిట్లయినా బొక్కెడు కొఱ్ఱలు కావు.

* బోసినోటివానికి పేలపిండి ప్రీతి.

* బోసిపంతికి దోకెడు నూనె, ఎట్లా తెత్తును ఏగాని?



**********:: బ్ర ::**********

* బ్రతకని బిడ్డ బారెడు.

* బ్రతికి ఉంటే బలుసాకు ఏరుకొని తినవచ్చు.

* బ్రతికి బావగారిని, చెడి స్నేహితుని చేరాలి.

* బ్రతికిన బ్రతుకు చావులో తెలుస్తుంది.

* బ్రతికిన బ్రతుకు చెప్పుకుందాము, బయట ఎవరు లేకుండా చూడమన్నాడట.

* బ్రతికిన బ్రతుక్కి భగవద్గీత పారాయణమా?

* బ్రతుకలేని వాడా బడి పెట్టుకోరా!

* బ్రతుకలేని వాడు బడిపంతులైనట్లు.

* బ్రతుకుటకు తినవలెను గానీ తినుటకై బ్రతుకరాదు.

* బ్రతుకు లెన్నాళ్ళు? భాగ్యాలెన్నాళ్ళు?

* బ్రమిసి బాపనయ్యని పోతే, శుక్రవారం చూపరా దన్నాడట.

* బ్రహ్మంవంతి గురువుంటే సిద్ధయ్యవంటి శిష్యుడు ఉండనే ఉంటాడు.

* బ్రహ్మకైనను పుట్టు రిమ్మ తెగులు (రిమ్మ=పిచ్చి).

* బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిరినా, లంజ ముదిరినా పనికిరాదు.

* బ్రహ్మచారి శతమర్కటః

* బ్రహ్మఙ్ఞానులవారు వచ్చారు, పట్టుబట్టలు భద్రం.

* బ్రహ్మ తలిస్తే ఆయుస్సుకు కొదువా? మొగుడు తలిస్తే దెబ్బలకు కొదువా?

* బ్రహ్మయాలితాడు పంది రేవున దెంచ.

* బ్రహ్మ వ్రాసిన వ్రాత చెఱిపేవాడు లేడు (తప్పునా?)

* బ్రహ్మ వ్రాసిన వ్రాలుకు ఏడువనా? రాగుల సంకటికి ఏడువనా?



**********:: బ్రా ::**********

* బ్రాహ్మడా! బ్రాహ్మడా! నీ ఆచారమెంత? అంటే నీటికొద్ది అన్నాడట.

* బ్రాహ్మడికీ బఱ్ఱెగొడ్డుకి చలేమిటి?

* బ్రాహ్మణింటిలో పుట్టితి, భట్టింటిలో పెరిగితి, కోమటింటిలో చస్తి.

* బ్రాహ్మణ పాలేరుతనం చేస్తావా? పల్లకీ ఎక్కుతావా? అంటే పల్లకి ఎక్కితే ఒళ్ళు కదులుతుంది, బ్రాహ్మణ పాలేరుతనమే చేస్తాను అన్నాడట.

* బ్రాహ్మణ సేద్యం - శూద్రతర్పణం (సంతర్పణ).

* బ్రాహ్మణుడు ఒంటిపూట పడ్డా పసరము వంటిపూట పడ్డా మానెడు.

* బ్రాహ్మణుని చేయి (నోరు) ఏనుగు తొండము ఊరుకోవు.

* బ్రాహ్మణుని మీద సంధ్య, కోమటిమీద అప్పు నిలువవు.

* బ్రాహ్మణులలో చిన్నకు బేస్తలలో పెద్దకు అవస్థలు.



**********:: భ ::**********

* భంగు(గి) తాగేవానికి హంగుగాళ్ళు పదిమంది.

* భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు.

* భక్తిలేని పూజ, పత్రి చేటు. (బత్తిలేని పూజ పత్తిచేటు).

* భక్తివచ్చినా పట్టలేరు, పగ వచ్చినా పట్టలేరు.

* భగవంతా నాకేం చింత అంటే, పొద్దున్నే లేస్తే పొట్టదే చింత.

* భగవద్గీత పుచ్చుకుంటారా అంటే, కడుపు నిండింది ఇంక తినలేను అన్నాడట.

* భటుడు వెంటలేక ప్రభుడు శోభింపడు.

* భట్టాచార్యుల వట్టలు కాగానే తిరుచూర్ణపు బుఱ్ఱలగునా?

* భజన చేయువాడు భక్తుండు కాడయా.

* భయంగల బల్లి, బావచాటుకు పోయి బుఱ్ఱుమంది.

* భయంగల మరదలు బావముందు బుఱ్ఱుమందట.

* భయపడి పరుగెత్తేవానికి వారశూల అడ్డమా?

* భయమైనా ఉండాలి, భక్తైనా ఉండాలి.

* భయానికి తగినట్లు కోట కట్టుకోవలె.

* భరణీకార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.

* భరణీకార్తెలో చల్లిన నువ్వుచేను కాయకు బరిగెడు గింజలు.

* భరణి కురిస్తే ధరణి పండును.

* భరణిలో పుడితే ధరణి ఏలును.

* భరణిలో (ఎండలకు) బండలు పగులును, రోహిణిలో రోళ్ళు పగులును.

* భరతుడికి పట్టాభిషేకం, రాముడికి రాజ్యం.

* భరతుడు పట్నం - రాముడి రాజ్యము.

* భర్త బడాయి భార్య మీదనే.

* భర్త లోకం తన లోకం, కొడుకు లోకం పరలోకం.

* భర్త వర్తనంబే సతికి గ్రాహ్యం.



**********:: భా ::**********

* భాంచేదు దేవుడికి మాదర్ చోద్ పత్రి.

* భాగీరథీ పిచ్చుగుంతమీద పారినట్లు.

* భాగ్యముంటే బంగారం తింటారా?

* భాగ్యవశముగాని బ్రతుకులు లేవయా.

* భాగ్యహీనునకు ఫలము లభించునా?

* భానునరయ దివ్వెపట్టి వెదకురీతి.

* భామల వలపు వేముల తియ్యదనము లేవు.

* భారంలేని బావ చస్తే, దూలం పడ్డా దుఃఖం లేదు.

* భారం పైన పడినప్పుడే బరువు తెలిసేది.

* భార్య అనుకూలవతి అయితే సుఖి అగును, లేకుంటే వేదాంతి అగును.

* భార్యచేతి పంచభక్ష్య పరమాన్నం కన్నా, తల్లి చేతి తవిటిరొట్టె మేలు.

* భార్య మాట బ్రతుకు బాట.

* భావాయ పున్నమకు పరగళ్ళు పచ్చబడతాయి.

* భాస్కరాచార్య్ల (భాష్యకారుల) వెంట్రుకలైతే మాత్రం, వీనకు తంతు లవతవా?

* భాషకు తగిన వేషముండాలి.

* భాషలెల్ల వేరు పరతత్వమొక్కటే.



**********:: భి ::**********

* బిక్షం బిడబిడా అంటే, దొంతులు లొడాలొడా అన్నాయట.

* భిక్షాధికారైనా కావాలి, లక్షాధికారైనా కావాలి.



**********:: భూ ::**********

* భూతాలకు బుద్ధిలేదు, నరునకు బద్ధం లేదు.

* భూదేవి అల్పసంతోషి, కాస్త కఱ్ఱుతో గిలిగింత (చక్కిలగిలి) పెట్టగానే నిండుపంటతో కలకల లాడుతుంది.

* భూమి కొత్త అయితే భోక్తలు కొత్తా?

* భూమి కొత్తదైన భూమేలు కొత్తవా?

* భూమిని చూర్ణం చేస్తే, పట్టెడెరువే పుట్టెడు పండిస్తుంది.

* భూనిని రాజుని కాచుకున్నవాడు చెడడు.

* భూములిచ్చినట్లు భూపతు లీయగలరా?



**********:: భో ::**********

* భోగములకెల్లను నెచ్చెలి జవ్వనంబు.

* భోగాపురం బొల్లి మేఘాలు అక్షయపాత్ర కనుగ్రహమా?

* భోజనం చేసిన వానికి అన్నంపెట్ట వేడుక, బోడితలవానికి వెంట్రుక వేడుక.

* భోజనానికి నేను, మా బొప్పడు, లెక్క చెప్పను నేనొక్కడనే అన్నాడట.

* భోజనానికి వచ్చి పొయ్యి త్రవ్వినట్లు.

* భోజనానికి వద్దంటే పట్టుచీర కట్టుకొని వస్తానన్నట్లు.

* భోజునివంటి రాజుంటే, కాళిదాసువంటి కవి ఉండనే ఉంటాడు.



**********:: భ్ర ::**********

* భ్రమరంబు తనరూపు క్రిముల కిచ్చినరితి.