అలను బుడగ పుట్టినపుడే క్షయమౌను
అలను బుడగ పుట్టినపుడే క్షయమౌను
కలను గాంచు లక్ష్మి గనుటలేదు
ఇలను భోగభాగ్య మీతీరె కానరు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం-
అలను బుడగ పుట్టినపుడే నీటి అలల మీద ఉద్భవించే బుడగ, క్షయమౌను నశించిపోతుంది, కలను గాంచు కలలో చూసే, లక్ష్మి ధనం కనుట లేదు చూడలేం, ఇలను భూమ్మీద, భోగభాగ్యం సంపదలను, ఈ తీరె ఈ విధంగానే కానరు చూడరు.
అల, కల, ఇల అంటూ అలల మీద, కలలలోనా, భూమ్మీదా కనిపించేవాటి ప్రస్తావన తెస్తూ, అల మీది నీటి బుడగ ఎలా అయితే వెనువెంటనే నశించిపోతుందో, స్వప్నంలో కనిపించే ధనం వాస్తవంలో ఎలా అయితే పనికిరాదో, అలాగే ఈ భూమ్మీది సంపదలు, భోగభాగ్యాలు కూడా అంతే సుమా అని వేమనాచార్యులవారు హెచ్చరిస్తున్నారు.
వేదాంతంలో అతి ఉచ్ఛస్థితిలో ఉండే సర్వోతృష్టమైన అద్వైత సిద్ధాంతం ప్రకారం, జాగృదావస్తలోని వాస్తవమని మనందరం దేన్నైతే నమ్ముతున్నామో అది కూడా స్వప్నావస్తలాంటిదే నన్నది మూల సిద్ధాంతం. జాగృదావస్త కూడా ఒక పెద్ద స్వప్నమే నంటూ శంకరాచార్యులవారు అద్వైతాన్ని బోధించారు. ప్రపంచంలో అన్ని సిద్ధాంతాలు, శాస్త్రీయమే కానీ లేదా ఆధ్యాత్మికమే కానీ కేవలం జాగృదావస్తనే పరిగణనలోకి తీసుకున్నాయి. కానీ అద్వైతమొక్కటే మానవుని మూడు దశలైన జాగృతి, స్వప్న, గాఢ సుషుప్తిలను కూడా లెక్కలోకి తీసుకుంది. వాటికీ సమానమైన ప్రాధాన్యతనిచ్చింది.
