పేను – నల్లి

పేను – నల్లి

bookmark

అనగనగా ఒక రాజ్యంలో ఒక పేను వుండేది. అది రాజుగారి హంసతూలికా తల్పాన్ని అంటి పెట్టుకుని, రాజుగారి రక్తం తాగుతూ హాయిగా జీవిస్తోంది. అది రాజుగారి రక్తం తాగినా అయనకి ఏమాత్రం నెప్పి కలుగకుండా తాగటం వల్ల రాజుగారికి ఎప్పుడూ ఏ బాధకలుగలేదు.

ఇలా వుండగా ఒక రోజు ఒక నల్లి వచ్చి ఆ పేనుని ఆశ్రయం ఇమ్మంది. ప్రతిరోజు పంచభక్ష్యపరమాన్నాలతో భోజనం చేసే రాజుగారి రక్తం చాలా బాగుంటుంది అని, దానిని ఒకసారి రుచి చూసి వెళ్ళిపోతానని నల్లి పేనుని బ్రతిమాలింది. మొహమాటం కొద్దీ పేను సరేనని ఒప్పుకుంది.

ఐతే “రాజుగారికి నిద్రపట్టేవరకు ఆగి, మెల్లగా నొప్పి పుట్టకుండా తాగమని” పేను చెప్పింది. సరే నని నల్లి అంది.
కానీ రాజు గారు వచ్చి మంచం మీద పడుకోగానే నల్లి ఆత్రంగా పుటుక్కున పొడిచి రక్తం తాగింది. ఆ బాధకు తట్టుకోలేకపోయాడు రాజు. వెంటనే సేవకుడిని పిలిచి అదేమిటో వెతకమన్నాడు.

సేవకుడు దీపం తెచ్చి పట్టెమంచం, పరుపు అంతా గాలించాడు. ఈలోగా నల్లి పరుగెత్తి పారిపోయి పట్టె సందులో నక్కింది. ఏమీ తెలియని పేను దుప్పటినంటిపెట్టుకుని సేవకుని కంట పడింది. అదే రాజుగారిని కుట్టిందని అనుకున్న సేవకుడు ఆ పేనును పట్టుకుని చంపేసాడు.

నీతి : గుణము, శీలము తెలియకుండా ఎవ్వరిని చేరదీయరాదు. అలా చేసిన, పేనుకి పట్టిన గతే పడుతుంది.