పాముకన్న లేదు పాపిష్టి జీవంబు
పాముకన్న లేదు పాపిష్టి జీవంబు
అట్టి పాము చెప్పినట్టు వినును
ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు
విశ్వదాభిరామ వినుర వేమ
తాత్పర్యం-
నేలమీద పాకే పాము అన్నిటికీ భయపడుతుంది, ప్రాణభయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న బొరియల్లో దాక్కుంటుంది. ఏ పాపం చేసుకున్నానో ఇలాంటి పాపిష్టి జన్మ లభించింది అని కొందరు అంటుంటారు. అలాగే పాము జన్మని పాపిష్టి జన్మ అని అన్నారు వేమన. అటువంటి పాము కూడా చెప్పినట్టు వింటుంది. అందుకే పాములను బుట్టలో పెట్టగలుగుతారు, వాటిని ఆడించగలుగుతారు. కానీ గుణ హీనుడు, దుర్మార్గుడైన మనిషిని మార్చటం ఎవరి తరమూ కాదంటారు శతక కర్త. అంతటి ఘనులెవరూ లేరని ఆ మాటను చాలా ఘనంగా చెప్పారాయన.
పాములో విషమున్నా, వేటాడి తినటానికి ఆ విషాన్ని ఉపయోగించదది. తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి మాత్రమే పాము కాటు వేస్తుంది. కానీ దుర్మార్గుడైన వాడు తనలోని విషమనే దుర్మార్గపు ఆలోచనని ఎదుటివాడిని నాశనం చెయ్యటానికే ఉపయోగిస్తాడు. ఎవరి సొమ్మైనా కబళించటానికే చూస్తాడు. అందుకే అటువంటి వాడిని మార్చే మొనగాడు భూమ్మీదనే లేడు అంటారాయన.
