నేరనన్నవాడు నెరజాణ మహిలోన

bookmark

నేరనన్నవాడు నెరజాణ మహిలోన
నేర్తునన్నవాడు నిందజెందు
ఊరకున్నవాడు ఉత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం-
తనకి అన్నీ తెలుసని బరిలోకి దూకినవాడు ఎప్పుడైనా బెడిసికొట్టినట్టయితే, మాటపోగొట్టుకునే అవకాశం ఉంది, నింద భరించవలసి రావొచ్చు అందుకే, నాకేం రాదు అని చెప్పేవాడు అతనికంటే తెలివైనవాడు. ముందే ఏమీ రాదని అన్నవాడిని ఎవరూ తప్పుపట్టరు. అంతకంటే తెలివైనవాడు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేవాడు. ఎటువంటి వాగ్దానాలు, హామీలు ఇవ్వని వారు, గుంభనంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ పోయేవారు నిజంగా ఘనులు.

యోగి అన్న పదానికి ఇక్కడ సన్యాసో బైరాగో అని కాదు. జీవితంలో సమతౌల్యతను పాటిస్తూ ఎవరి మెప్పూ ఆశించకుండా ఎక్కడా ఎలాంటి ప్రగల్భాలు పలకకుండా జీవితాన్ని సాఫీగా నడిపేవాడు యోగి. భగవద్గీతలో యోగి లక్షణాలను వివరించిన శ్రీకృష్ణుడు చివరగా, అందువలన నీవు యోగి అవు అర్జునా అంటాడు. యోగికి మౌనం పెద్ద ఆయుధం.

మనం మాట్లాడటానికి ఎంతో శక్తిని ఉపయోగిస్తాం. కేవలం మాట బయటకు రావటానికి ఉపయోగించే ఊపిరే కాదు, భాషను గుర్తు చేసుకోవాలి, చెప్పదలచుకున్న బావానికి సరిపడే పదాలను ఎన్నుకోవాలి, వ్యాకరణం పాటించాలి, మాటల్లో సొంపు ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎదుటివారికి అది అర్థమయ్యేలా ఉండాలి, వారు మెచ్చేదిగా ఉండాలి. ఏ ఉద్దేశ్యంతో ఆ పలుకులు పలికామో ఆ ఫలితం వచ్చేదిగా ఉండాలి. ఇవన్నీ ఆలోచించటానికి కూడా శక్తి వినియోగమవుతుంది. ఇంతా చేసి మాట్లాడిన తర్వాత ఆశించిన ఫలితం లేకపోతే నిరాశ, ఫలితముంటే ఆనందంతో గంతులువేయటం ఇవన్నీ కూడా శక్తిని హరించేవే. తన శక్తిని పదిలంగా ఉంచుకుంటూ, ఇంకా పెంచుకుంటూ, ఆచితూచి ఖర్చు పెట్టేవాడే నిజమైన యోగి. అవసరమైనప్పుడు తప్పకుండా మాట్లాడుతాడు యోగి!