నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాలు తట్టెడేల
చదువ పద్యమరయ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం-
రంగురాళ్లు, గులకరాళ్ళు తట్టలకొద్దీ పోగుచేసుకున్నదానికంటే ఒక్క మంచి జాతి రాయి ఉంటే చాలు కదా, అలాగే మనసు రంజింపజేసే సత్యాన్ని వెల్లడించే పద్యం ఒక్కటే చాలు
మనిషి ఎప్పుడూ ఏదో ఒకటి పోగుచేసుకుంటూనేవుంటాడు. చిన్నప్పుడు పోగు చేసుకునే వస్తువులు వేరు. పెద్దవుతున్నకొద్దీ, లోకఙానం పెరుగుతున్నకొద్దీ పోగుచేసుకునే వస్తువులలో తేడా ఉంటుంది కానీ పోగుచేసుకునే లక్షణం మాత్రం పోదు. చీమలు ఏది బడితే అది పోగుచేసుకుంటాయి, కానీ తేనెటీగ ఎన్ని చోట్లకి తిరిగినా తేనె తప్ప మరేమీ పోగుచేసుకోదు. అలాగే పనికిరాని సాహిత్యం చదివేదానికంటే ఇంపుగా చెప్పే ఒక మంచి నీతి పద్యం చదివితే అదే చాలు అంటారు వేమనాచార్యులవారు. కానీ వేమన పద్యాలు వేలల్లో ఉన్నాయి. పేరుకి శతకం అన్నా వేలల్లో పద్యాలు లభ్యమౌతాయి.
అయితే, అవన్నీ వేమన రచించినవి కావు అని కొందరంటారు. ఎవరు రచిస్తే ఏమిటి అది బాగుండాలి, ఉపయోగపడాలి కానీ. ఆయనే రచించాడని పొగిడినా కాదన్నా ఎలాంటి తేడా రాని స్థితి వేమనది. ఆయన అసలు పేరు వేమనారెడ్డి, ఆతను మా కులం వాడు, మా ప్రాంతం వాడు, మా భాష వాడు, మా యోగుల్లో ఒకడు ఇలా ఎందరు ఎన్ని రకాలుగా అనుకున్నా, మానవులంతా ఉన్నంతకాలం గుర్తుండేలా పనికివచ్చేలా పద్యాలను రచించిన వేమన ఒక చాటు పద్యం చాలని అన్నా, ఎన్నో పద్యాలను మానవాళికి బహూకరించాడు.
