ఏమి గొంచు వచ్చె తానేమి గొనిపోవు

bookmark

ఏమి గొంచు వచ్చె తానేమి గొనిపోవు
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనములెచటికేగు దానెచ్చటికేగు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం-
మనిషి పుట్టేటప్పుడు ఏమీ తీసుకునిరాడు, చనిపోయేటప్పుడు ఏమీ తీసుకుని పోలేడు. సంపదలెటుపోతాయో, తానెటుపోతాడో కదా!

"ఒట్టి చేతులతోనే వస్తామూ, ఒట్టి చేతులతోనే పోతాము కానీ, సంపదలను తీసుకుని రాలేదు, పట్టుకుని పోలేము. చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి పోతాడో, అతని సంపదలు ఎక్కడ ఎవరికి చెందుతాయో కదా" అనే వాక్యాలను చాలా మంది వేదాంతులు చాలా భాషల్లో శలవిచ్చారు.

ఇది కేవలం మనిషిలోని దురాశ, తాపత్రయాన్ని తగ్గించటానికి చెప్పిన మాటలు, అనవసరమైన పోటీలు తగ్గించి, న్యాయమార్గంలో ఆర్జిస్తూ, ఇతరులకు నష్టం కలిగించకుండా ఉండటానికి చెప్పిన మాటలే కానీ, నిజానికి ఏమీ తీసుకుని రాలేదు కదా ఏమీ తీసుకుని పోలేము కదా అని వాళ్ళని నిర్లిప్తంగా చెయ్యటానికన్న మాటలు కావు!