మైలకోక తోడ మాసిన తలతోడ
మైలకోక తోడ మాసిన తలతోడ
ఒడలు మురికితోడ నుండనేమి
అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం-
పారిశుద్ధతను పాటించనివాడు అగ్రకులానికి చెందినా సరే ఆ మనిషిని ఎవరూ దగ్గరకు రానీయరు.
వేమన కాలంలో కులాల పట్టింపులు ఎక్కువగా ఉండేవి. అంటరానితనం ప్రబలంగా ఉండేది. ఆచార వ్యవహారాలు ఎక్కువగా శౌచం, పరిశుభ్రతలను పాటించటంకోసం చేసిన నిబంధనలు. ఈ సంగతి మరుగునపడిపోయి, ఆచారంలా కులాల్లో పాకిన ఆరోగ్య సూత్రాల వెనుకనున్న వాటి కారణాన్ని గుర్తుచెయ్యటం కోసమే వేమన ఈ పద్యంలో, శుభ్రతను పాటించనివారిని ఎవరూ దగ్గరకు రానివ్వరని, పెద్ద కులంలో పుట్టినంత మాత్రాన అటువంటివారిని అక్కున చేర్చుకోరని చెప్పారు. ఇళ్ళల్లో కూడా, పిల్లలు బయటినుంచి రాగానే, ముందు స్నానం చేసిరా, బట్టలు మార్చుకో అని ఆంక్షలు పెడుతుంటారు. అలా అనటం వలన, శుభ్రం పడేంతవరకూ దగ్గరికి రానివ్వకపోవటమే కాదు, ఇంటి లోపలికి కూడా రానివ్వకుండా ఉండటం వలన, కొన్నాళ్ళకి వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవటం, శుభ్రంగా లేకపోతే ఎదుటివారికి ఇబ్బంది కలుగుతుంది అనే సామాజిక బాధ్యత వస్తుంది. విమానాలలో కానీ ఎసి భోగీల్లో కానీ, ప్రయాణం చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించటం మన బాధ్యత. ఇది కులానికి సంబంధించింది కాదు. పారిశుభ్రతా సూత్రం. అలాగే, సాక్స్ లోంచి కానీ, వేసుకున్న బట్టలలోంచి కానీ, నోటిలోంచి కానీ దుర్వాసన రాకుండా చూసుకోవటం ఎవరికివారు తెలుసుకుని చేసుకోవలసిన అలవాటు. అంతరిక్షంలో ప్రయాణంచేసి వచ్చిన వ్యోమగాములు భూమి మీదకు రాగానే వారిని బయట ప్రపంచంలోకి రానివ్వరు. వారి వలన వేరే గ్రహం నుంచి వ్యాధులను కలుగజేసే సూక్ష్మజీవులు దిగుమతి కావచ్చు కదా. వారు పెద్ద పెద్ద చదువులు చదివిన శాస్త్రఙులే మరి. అక్కడ కుల ప్రసక్తేమైనా ఉందా. అలాగే శుభ్రతను తెలియజేసే క్రమంలో అది అంటరానితనంగా రూపాంతరం చెందింది.
