మృగమదంబు జాడ మీద నల్లగనుండు
మృగమదంబు జాడ మీద నల్లగనుండు
పరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణములీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం-
చూడటానికి నల్లగా కనిపించే కస్తూరి, సువాసనలో మేటి అయినట్టుగానే, సద్గురువుల లక్షణాలు కూడా పైకి గొప్పగా కనపడవు.
కస్తూరి అంటే ఏమిటో కూడా ఈ కాలం వారికి తెలియకపోవచ్చు. అడవి జంతువుల్లో కస్తూరి జంతువు అని ఒక జంతువు ఉంటుంది. దాని బొడ్డులో నల్లని పదార్థముంటుంది. దాని సువాసన చాలా దూరం వరకూ వ్యాపిస్తుంది. పూర్వకాలంలో మనుషులు తక్కువ, అడవి జంతువులు ఎక్కువగా ఉన్న సమయంలో, వన్య ప్రాణి సంరక్షణ అవసరం లేని ఆ సమయంలో మనుషులు యధేచ్ఛగా జంతువులను వేటాడేవారు. ఆ సమయంలో ఈ కస్తూరి జంతువుని కనుగొన్నారు. దాని నుంచి వచ్చే నల్లని పదార్థాన్ని కస్తూరి అనేవారు. దాన్ని నుదుటన పెట్టుకునే బొట్టులో కలిపి పెట్టుకుంటే రోజంతా సువాసన వస్తుండేది. అప్పుడంతా సహజంగా దొరికే పుష్పాలు, కస్తూరిలతోనే వాతావరణాన్ని సువాసనలతో నింపుకునేవారు. కృష్ణుడిని వర్ణించేటప్పుడు కస్తూరీ తిలకం లలాట ఫలకే'' అన్నదానిలో కస్తూరి ఇదే. ఆ సమయంలోనే కస్తూరి నల్లగా బాగోలేదు అనుకునే వారు ఇక ఈకాలంలో ప్రతి వస్తువూ అందమైన ప్యాక్ లలో వస్తున్న సమయంలో ఏమనుకుంటారో కానీ అసలు ఇప్పుడు లభించటమే దుర్లభం.
