తెలుగు సామెతలు-ర

bookmark

* రంగడా విభీషణునికి పంగనామ మిడినరితి

* రంగడికి లింగడికి స్నేహం, రొట్టెకాడ గిజగిజలు.

* రంగము సొమ్ము, ఱంకుసొమ్ము నిలువదు (రంగము=రంగూను).

* రంగుల దుప్పట్లు వీగొంగడికి సరిపోలవన్న గువ్వలచెన్న.

* రండ కొడుకైనా కావలె, రాజు కొడుకైనా కావలె.

* రండ తుపాకీ కాలిస్తే, గుండు గాలికి పోయిందట.

* రండ రాతకు పెండ సిరా (పెండ=పేడ).

* రండరాజునకు గొండడు దళవాయి.

* రందిగాడికి రేయింబవలు తెలియదు.

* రంభ చెక్కిలి నొక్కి రాట్నం తెచ్చినట్లు.

* రంభయైన తన కుచకుంభముల్ తనచేత తాబట్టుకొనిన సుఖము లేదు.

* రక్కసి ఆలుకు అనదమగడు.

* రక్షచాలని మృగేంద్రుని నక్కయు గోలుపుచ్చు.

* రచ్చకెక్కిన సభలో రాయబార మేల?

* రజకుని గానము, రండా ప్రభుత్వము.

* రట్టూ, రవ్వా రావిపాటి వారిది, పుస్తే పూసా పూసపాటి వారిది.

* రతిలేని నాతి (పరుగు) గతిలేని గుఱ్ఱము రాణించవు.

* రతిలో సిగ్గు, రణములో భీతి కొరగావు.

* రత్నం బొరునిచే నన్వేషింపబడును గానీ, యెరు నన్వేషించునే?

* రత్నాన్ని బంగారంలో పొదిగితేనే రాణింపు.


* రత్నాన్ని రువ్వి గాజును కోరినట్లు.

* రత్నాలన్ని ఒక చోటికి, రాళ్ళన్నీ ఒక చోటికి.

* రత్నాలు తినే పక్షికి రత్నాలు, రాళ్ళు తినే పక్షికి రాళ్ళు.

* రత్నాలున్న గనిలోనే రాళ్ళుండేది.

* రమాపతే, సీతాపతే, పొద్దున లేస్తే పొట్టేగతి.

* రమ్మన్నారు తిమ్మన్న బంతికి - అన్నట్లు.

* రవిక, పగలు బిడ్డ కడ్డము, రాత్రి మగని కడ్డము.

* రవికలోనే చీర మిగిలించాలంటే ఎలాగు?

* రవి గాననిచో కవిగాంచనేర్చు నెయ్యెడన్.

* రవ్వ రవ్వతో తెగుతుందికానీ, రాతితో తెగుతుందా?

* రసం ముదిరితే రాగం, పాకం ముదిరితే పాట.

* రహస్యమేమిటంటే, (విశేషమేమిటంటే) వడ్లగింజలోది బియ్యపుగింజ అన్నట్లు.

* రక్షలు పోతే మచ్చలు పోతాయా? (రక్షలు=రక్ష కోసం వాతలు).



**********:: రా ::**********

* రా అమ్మేగానీ పో అమ్మ లేదు.

* రాకుండా చూచి పోకుండా కొట్టినట్లు.

* రాకు, పోకు బంగారు చిలక.

* రాగం లేని భోగం, త్యాగం లేని ఈవి.

* రాగం తియ్యనివాడు, రోగం రానివాడు లేడు.

* రాగల శని రామేశ్వరం వెళ్ళినా తప్పదు.

* రాగిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు పుడతారంటే, చుట్టుచుట్టుకు పొట్ట చూచుకొన్నదట.

* రాగిపైసా చల్లగుంటే, రాచబిడ్డగూడా దిగివస్తుంది.

* రాగిపోగులు తగిలించుకున్నావేమిరా? అంటే, నీకు అవైనా లేవుకదా అన్నాడట.

* రాగిపైరులచెంత రమ్యమౌ వరిమొలక రాజిల్ల నేర్చునా?

* రాగి రాగోరును.

* రాగులరాయి తిరుగుతూ ఉంటే రాజ్యమంతా చుట్టాలే.

* రాఘవా! స్వస్తి. రావణా స్వస్తి. (అందరికి మంచిగా ఉండుట).

* రాచతనానికి జందెపుపోచా గుర్తు?

* రాచపగ - త్రాచు (పాము) పగ.

* రాచపీనుగు తోడులేకుండా పోదు.

* రాచబిడ్డ స్మరాలయము కాగానే పూజకు దాసాని పువ్వగునా?

* రాచవారి పసులకు బందిలేదు.

* రాచవారి భోగం రైతుల త్యాగం.

* రాజమకుటం శిరోవేదనను పోగొట్టలేదు, ఐశ్వర్యం ఆనందమును కొనిపెట్టలేదు.

* రాజరాజులకు రాజదండం, కాపుకు కరుకోల (కరుకోల=కఱ్ఱు).

* రాజు ఎంతో, ప్రజలూ అంతే.

* రాజులు ఎవరైనా రాగులు విసరేది తప్పదు.

* రాజుకంటే మొండివాడు బలవంతుడు.

* రాజు కత్తికి రెండువైపులా పదునే (వాదరే).

* రాజుకన్నా చిన్న, మంత్రి కన్నా పెద్ద.

* రాజుకు కంటను, పాముకు పంటను విషం.

* రాజు కూతురైనా ఒకని ఆలే.

* రాజుగారి కొడుకైనా కావాలి, సానిదాని తమ్ముడైనా కావాలి.

* రాజుగారి గుఱ్ఱమైతే మాత్రం తొక్కితే కాలు నొవ్వదా?

* రాజుగారి పెద్దభార్య పతివ్రత అన్నట్లు.

* రాజుగారి పెళ్ళాం మేడ ఎక్కితే, కుమ్మరివాడి పెళ్ళాం ఆవ మెక్కిందట.

* రాజుచేసిన కార్యాలకు, రాముడు జేసిన కార్యాలకు ఎన్నికలేదు.

* రాజుతలిస్తే గాజుకంబాల కేమి కొదువ?

* రాజు తలిస్తే దెబ్బలకు కొదువా? బ్రహ్మ తలిస్తే ఆయుస్సుకు కొరవా?

* రాజు దృష్టికి రాయి పగులును.

* రాజు నీతి తప్పితే, నేల సారం తప్పుతుంది.

* రాజుని చూసిన కంటితో మొగుణ్ణి చూస్తే మొట్ట బుద్దయింది.

* రాజపాపం పురోహితుని కొట్టుకపోవును.

* రాజు పెద్దకూతురిని పెండ్లి చేసుకోను నాకేమి అభ్యంతరం లేదన్నట్లు.

* రాజు పోతులాగే ఉన్నాడు, రాజుపెండ్లం రంభలాగే ఉంది.

* రాజు మెచ్చింది మాట, మొగుడు మెచ్చింది రంభ.

* రాజు రాకడ లేదు! నూకుడు లేదు (నూకుడు=కొట్టుట, చిమ్ముట).

* రాజులకు పిల్లనిస్తే రాళ్ళ కిచ్చినట్లే.

* రాజుల చనవు ఎన్నాళ్ళు?

* రాజుల సొమ్ము రాళ్ళ పాలు.

* రాజుల సొమ్ము లంజల పాలు.

* రాజులు పోతే రాజ్యాలు పోతవా?

* రాజు లేని ఊళ్ళు, పూజలేని గుళ్ళు.

* రాజులేని రాజ్యం, కాపులేని గ్రామం.

* రాజు వలచిన రంభ, రాజు విడిచిన తుంబ.

* రాజ్యము వీరభోజ్యం.

* రాజ్యాలు ఉడిగినా లక్షణాలు ఉడగలేదు.

* రాజ్యాలు పోయినా, రాచరికాలు (రాజసాలు) పోలేదు.

* రాట్నం వచ్చింది, బండి అడ్డం తీయరా అన్నాడట.

* రాట్నానికి రెండు చెవులు, నాకూ రెండు చెవులు.

* రాణివాసం వచ్చి మూలవాసం పీకిందట (రాణివాసం=రాజభోగం, మూలవాసం= ప్రధానమైన ఇంటివాసం).

* రాతకు (వ్రాతకు) మించిన లొతు లేదు (రాత=నొసటివ్రాత).

* రాత బొడిచినా చావు లేదు.

* రాతికట్ట, పంత చెరువుకు గాక గండి గుంట కేల?

* రాతి కుండకు ఇనుప తెడ్డు.

* రాతి పశువును పూజిస్తారు, చేతిపశువును బాదుతారు.

* రాతిబొమ్మకు చక్కిలిగింతలు పెట్టినట్లు.

* రాతిలో కప్ప, రాతిలోనే బ్రతికినట్లు.

* రాత్రి అంతా రభసైతే, రక్తి ఎప్పుడు?

* రాత్రికి వెన్నెల, పైరుకు వెన్నులు పస.

* రాత్రి పడ్డ గొతిలో పగలు పడతారా?

* రాదన్న పని రాజుపని, వస్తుందన్నపని తొత్తు పని.

* రాని అప్పు (సొమ్ము) రాతితో సమానమన్నాడట.

* రానిపాట పాడ వేడుక, బోడితల అంట వేడుక.

* రానివాడి మీద ఱాయి.

* రాని వానినిఉ పిలువ వేడుక.

* రానురాను గుఱ్ఱం గాడి దయిందట.

* రానూవచ్చె, పోనూపోయె, రాగులువిసరి సంకటి చేయమన్నాడట.

* రాబందుకు, రాజుకు తేడాలేదు.

* రామక్క దేమిపోయె? రామన్న దేమిపోయె? రాసిలోనిదే దోసెడుపోయె.

* రామనామధారి రాక్షసుండు.

* రామాండ కతలెల్ల మే మెఱుంగని పనే? కాటమరాజుకు కర్ణుడోడె - అన్నట్లు.

* రామాయపట్నం మధ్యస్థం. (న్యాయం చెప్పమంటే, చెరిసగం చేసుకోమన్నట్లు).

* రామాయణం అంటే ఏమో అనుకున్నానుగానీ, మాశి బరువుంది అన్నాడట.

* రామాయణం అంటే సామాన్యంగాదు, గాడిద మోతంత ఉందే, అన్నాడట.

* రామాయణం ఱంకు, భారతం బొంకు.

* రామాయణంలో పిడకల (పిటకల) వేట్లాట (కాట్లాట, కొట్లాట).

* రామాయణం అంతా విని, రాముడికి సీత ఏంకావాలని అడిగాడట.

* రాముడినాడు లేదు, భరతుడినాడూ లేదు, శత్రుఘ్నునినాడు చెవుల వాదులు అన్నట్లు.

* రాముడులేని రాజ్యం లాగా.

* రాముని పాదాలు తగిలితే, రాళ్ళు రమణులవుతవి.


* రామునివంటి రాజుంటే, హనుమంతునివంటి బంటూ ఉంటాడు.

* రామునివంటి రాజు, రావణుని వంటి వైరి లేరు.

* రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు (వదలలేదు).

* రామేశ్వర వెళ్ళినా ఱంకుమగడు తప్పలేదట.

* రాయలవారి ఏనుగు పిత్తుతుంది అని మూటకూళ్ళు కట్టుకొనిపోతే, అది తుస్సున పోయిందట.

* రాయంగ రాయంగ కరణం - దగ్గంగ దగ్గంగ మరణం.

* రాయుడిది తలది, చాకలిది మొలది.

* రాల రువ్వదగినవాని పూల రువ్వరు.

* రాలిన పూవు రెమ్మకు అతుక్కుంటుందా?

* రాళ్ళకోపని గుద్దలిని వాడిచేసే వాళ్ళుందురా?

* రాళ్ళ చెలుక - రండబిడ్ద, కాపువానికి కలిసివస్తాయట.

* రాళ్ళచేను రత్నాలు పండుతుంది.

* రాళ్ళచేల్లో గుంటక తోలినట్లు (గుంటక=చదునుచేయు సాధనం).

* రాళ్ళు తినే పక్షి రాళ్ళు తింటుంది, రత్నాలు తినే పక్షి రత్నాలు తింటుంది.

* రావణాసురుడి కాష్టం వెలె (ఎడతెగనిది).

* రావేమయ్యా తిండివేమయ్యా! అంటే వెన్నక్కే పోయానన్నాడట.

* రాష్ట్రం దాగినా (దాటినా) రంకు దాగదు.



**********:: రి ::**********

* రిక్తమనసు కోర్కెలకు పెద్ద.



**********:: రీ ::**********

* రీతికి వస్తే కదా రంగానికి వచ్చేది?



**********:: రు ::**********

* రుచిమరిగిన పిల్లి ఉట్టిమీదకు ఎగిరినట్లు.

* రుచీపచీలేని కూర కంచానికి చేటు, అందం చందంలేని పెళ్ళాం మంచానికి చేటు.

* రుద్రాక్షిపిల్లి (వంటివాడు, కపటసన్యాసి).



**********:: రూ ::**********

* రూక యివ్వని విటకాని పోటు మెండు.

* రూకలు పదివేలున్నా చారెడు నూకలే గతి.

* రూకలేని వాడు పోక చేయలేడు.

* రూపంచేత స్త్రీలు, పరాక్రమంచేత పురుషులు రాణింతురు.

* రూపాన పాపిష్టి, గుణాన పాపిష్టి.



**********:: రె ::**********

* రెంటికి చెడ్డ రేవడు వలె (రేవడు=చాకలి).

* రెండావుల పాలు తాగిన దూడ.

* రెండావుల పాలు దాగేవాడు (కుడిచేవాడు) (ఉభయపక్షాలకు చెందినవాడు అనుట).

* రెండు ఊళ్ళ వ్యవసాయం, ఇద్దరు భార్యల సంసారం.

* రెండు ఏండ్లవరపు, మూడు ఏండ్ల మురుగు ఉండదు.

* రెండుచేతులు కలిస్తేనే చప్పుడు అయ్యేది.

* రెండు తప్పులెప్పుడూ ఒక ఒప్పు కాలేవు.

* రెండు నలుపులు కలిసి ఒక తెలుపు కానేరదు.

* రెండు నాలుకలవాడు. (మాట నిలకడ లేనివాడు).

* రెండు పడవలలో కాళ్ళు బెట్టినట్లు (పెట్టినవాడు). (ఉభయపక్షాలకు ప్రీతిపాత్రుడు కాదలచువాడు).

* రెండ్ వేదంతయుక్తులు వాగగానే రాజయొగి కాడు.

* రెండువేళ్ళతో నాటవచ్చునుగానీ, అయిదువేళ్ళతో పెరకరాదు.

* రెండూ రెండే, కొండప్పా.

* రెడ్డి కరణం లేని ఊళ్ళో, చాకలివాడే పిన్నా పెద్ద.

* రెడ్డి మడ్డి రోమాల ముడ్డి.

* రెడ్డి మడ్డి బంగారు కడ్డి.

* రెడ్డి వచ్చాడు మొదలెత్తుకో (పురాణం).

* రెడ్డివారి ఆబోతు (రెడ్డోళ్ళ)తా ఎక్కదు ఇంకొకదానిని ఎక్కనియ్యదు.

* రెడ్డేమి చేస్తున్నాడురా, అంటే - పైన పండుకొను ఉన్నాడు: అమ్మో - క్రింద పండుకొని ఉన్నది; ఎప్పుడూ ఇంతేనా? అప్పుడప్పుడు అమ్మగూడా పైన పండుకొంటుంది అన్నాడట.

* రెడ్లకు -వడ్లకు పేర్లు చెప్పలేము.

* రెడ్లలో తెగలకు, వడ్లలో తెగలకు లెక్కలేదు.

* రెడ్లున్న ఊరిలో, రేచులున్న కొండలో ఏమీ బతకవు.

* రెప్పలార్చేవాళ్ళు కొంపలారుస్తారు.



**********:: రే ::**********

* రేగడి భూమిని, రెడ్డినీ చేవిడువరాదు.

* రేగుకంపపై గుడ్డవేసి తీసుకొన్నట్లు.

* రేగుచెట్టు కింద గుడ్డివాని సామ్యము.

* రేగుచెట్టు కింద ముసలామెవలె.

* రేగుపండ్లకు ముత్యాలమ్ముకొన్నట్లు.

* రేజీకటి మొగుడికి గుడ్డి పెండ్లాము.

* రేపటికి కూటికిలేదని రేయింబవలు వ్యసనమందనేల?

* రేపటి నెమలికంటే, ఈనాటి కాకి మేలు.

* రేపల్లెవాడలో పాలమ్మినట్లు.

* రేపు అనే మాటకు రూపులేదు

* రేవతి వర్షం రమణీయం.

* రేవులోని తాడి అడ్డుచేటు.



**********:: రై ::**********

* రైతు పాడు, చేను బీడు.

* రైతు బీద గానీ, చేను బీద గాదు.

* రైతు లెక్క చూస్తే, నాగలి కూడా మిగలదు.

* రైతు క్షేమం రాజు భాగ్యం.



**********:: రొ ::**********

* రొండూ రొండే, ఱొంటికి పుండ్లే (ఱొంటికి=నడుముకు).

* రొంపికఱువు రోతబుట్టించి, వరపుకఱవు ఒరగబెట్టుతుందా?

* రొక్క మిచ్చినవాడే రేవెలదికి మన్మధుడు.

* రొట్ట కట్టె దేశంలో పుట్టగోచీవాడే భాగ్యవంతుడు (రొట్ట=పచ్చిఆకు ఎరువు).

* రొట్టెకు ఏరేవైతేనేమి? (కొరకను).

* రొట్టె తిని, రోసినావుకానీ, నానివంకచూడు నా తమాషా.

* రొట్టెలవాడి పనికంటే, ముక్కలవాడి పని మేలు.

* రొట్టెలేదు గానీ, నెయ్యిఉంటే అద్దుకు తిందును- అన్నాడట.

* రొట్టె విఱిగి నేతిలో పడ్డట్టు.

* రొయ్యకు లేదా బారెడు మీసం.



**********:: రో ::**********

* రోకట చిగుళులు కోసినట్లు.

* రోకలి చిగురు పెట్టినట్లు.

* రోకలి తూలితే చుట్టాలు వస్తారు.

* రోకలి పోటు - దాసరి పాట.

* రోగమంటే వచ్చింది గానీ, పాలు ఎక్కడనుంచి వస్తవి?

* రోగము ఒకటి, మందు ఇంకొకటి.

* రోగానికి మందుగానీ, ఆయుర్దాయానికి మందులా?

* రోగాలలో గురక ప్రమాదం (గురక=పశువ్యాధి).

* రోగాలు మనుషులకు గాక మాకులకు వస్తవా?

* రోగికి కోప మెక్కువ.

* రోగికోరింది పాలే, వైద్యుడు చెప్పింది పాలే.

* రోగిష్టికి పాపిష్టి కావాలి.

* రోజులు మంచివని పగలే దొంగతనానికి బయలుదేరినట్లు.

* రోటిని చూచి పాట పాడాలి.

* రోటి పాట రోకటి పాట (మార్పు లేని వనుట).

* రోటిలో తలదూర్చి, రోకటిపోటుకు వెఱచినట్లు.

* రోతలకు రోత ముదిమి.

* రోలు కఱ వెఱుగదు.

* రోలుకు ఒకవైపు, మద్దెల కిరువైపుల దెబ్బలు.

* రోలు పగిలినా లిద్దె బాగా బిగిసినది అన్నట్లు.

* రోలుపోయి మద్దెలతో మొర పెట్టుకొన్నట్లు.

* రోళ్ళు పాడినట్లా? రోకళ్ళు పాడినట్లా?

* రోసంలేని బంటుకు మోసం లేదు.

* రోసంలేని మూతికి మీసం ఎందుకు?


* రోసాన సాయబు రొట్టెన్నర తిన్నాడట.

* రోసి వేసినది రాశికి వచ్చింది.

* రోసానికి పోయిన రొండ్లెగుసవు.

* రోషానికి రోలు మెడను కట్టుకొన్నట్లు.

* రోహిణి ఎండకు రోళ్ళు పగులును.

* రోహిణికార్తెలో విత్తుట రోటిలో విత్తుటే.

* రోహిణికార్తెలో విత్తులు రోయక వేస్తారు, మృగశిరలో ముంచి పోస్తారు.

* రోహిణిలో జొన్నలు - సాహిణిలో గుఱ్ఱాలు.

* రోహిణిలో రోకళ్ళు చిగిర్చనన్నా చిగిరిస్తవి, రోళ్ళు పగులనన్నా పగులుతవి.

* రోహిణిలో విత్తనం, రోళ్ళూ నిండని పంట.



**********:: రౌ ::**********

* రౌతు కొద్ది గుఱ్ఱము.

* రౌతు దిగాలంటున్నాడు, గుఱ్ఱం ఎగరవేయా (పడదోయాల) అంటున్నది.

* రౌతు మెత్తనైతే గుఱ్ఱం మూడుకాళ్ళతో నడుస్తుంది.