ఈదిదాటగలుగు నే సాగరంబైన

bookmark

ఈదిదాటగలుగు నే సాగరంబైన
సాధువృత్తితోడ సమయమందు
పాడుకొనుచు మనసు పరిపూర్ణమొందును
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం-
సాధుప్రవర్తనతో మెలిగినట్లైతే సమయాన్నిబట్టి ఏ సముద్రాన్నైనా ఈది దాటగలుగుతాడు. భక్తి తత్వాలు మనసులో పాడుకుంటూ తన మనసుని నిర్మలంగా చేసుకోవటం వలన కాలక్రమేణా అది పరిపూర్ణమౌతుంది.

మనసు ఎప్పుడూ ఏదో ఒక విషయం మీదికి పరిగెడుతూ ఉంటుంది. అటువంటి మనసుని నియంత్రించటానికి దాని వెనకాల మనం కూడా పరిగెడితే అది జరిగే పని కాదు. ఎగురుతున్న పక్షులను పట్టుకోవటానికి ఎలాగైతే వాటికి కావలసిన దాణా వేస్తారో, జంతువులను పట్టుకోవటానికి దానికి ఇష్టమైన ఆహారాన్ని ఎలాగైతే చూపించి అది దగ్గరకు రాగానే పట్టుకుంటారో అలాగే మనసుని నిశ్చలంగా ఉంచుకోవాలంటే దాన్ని ముందుగా ఏదో ఒక విషయం మీద లగ్నం చేసి ఉంచాలి. అలాంటి ప్రయత్నమే భక్తిగీతాలను మనసులో కానీ బిగ్గరగా కానీ చదువుకోవటం. దానివలన మనసు ముందు నిశ్చలమవుతుంది, ఆ తర్వాత నిర్మలమవుతుంది, ఆ తర్వాత పూర్తిగా లయమవుతుందని కనిపెట్టిన మహాత్ములు మనకూ ఆ సాధనానిచ్చారు. అందుకే పాడుకొనుచు మనసు పరిపూర్ణమగును అంటారు వేమనాచార్యులవారు.