బాటసారి కథ

bookmark

 "అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ మర్రిచెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో...ఎన్నెన్నో పక్షులు ఉంటున్నాయి. ఆ పక్షుల్లో ఓ కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకం. అదలా ఉండగా...ఒక రోజు తెల్లవారు జామునే వేటగాడొకడు అడవిలో నూకలు చల్లి, వాటిపై వలపన్నాడు. వలపన్ని చెట్టు చాటుగా దాక్కున్నాడు. తెల్లగా తెల్లారింది. పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీది నూకల్ని చూశాయి. ఆకలనిపించింది వాటికి. తినాలని ఆశపడ్డాయి. కిందికి గుంపుగా దిగసాగాయి.‘‘ఎక్కడికి’’ అడిగాడు చిత్రగ్రీవుడు. అతను ఆ పావురాల రాజు.‘‘కింద నూకలున్నాయి. తిందాం’’ అన్నాయి పావురాలు.‘‘ఆగండాగండి’’ హెచ్చరించాడు చిత్రగ్రీవుడు. ఆగాయి పావురాలు.‘‘తొందరపడవద్దు! మనుషులే కనిపించని ఈ అడవిలో నూకలు ఎక్కణ్ణుంచి వస్తాయి? ఇందులో ఏదో మోసం ఉంది. వద్దు! మనం ఆ నూకల కోసం ఆశపడవద్దు’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘ఇలా ఆశపడే పూర్వకాలంలో ఒక బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు’’ అన్నాడు.‘‘అలాగా’’ ఆశ్చర్యపోయాయి పావురాలు.‘‘అవును! మీకు ఆ కథ చెబుతాను వినండి’’ అంటూ కథ చెప్పసాగాడు చిత్రగ్రీవుడు.ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు గట్టున ఓ పొద ఉంది. ఆ పొదలో ముసలి పులి ఒకటి నివసిస్తోంది. గట్టు మీద నుంచి ఓ బాటసారి పోతున్నాడు. అతన్ని చూసింది పులి.‘‘ఇదిగో’’ అని కేకేసింది.పిలుస్తున్నది ఎవరా? అని చూశాడు బాటసారి. పులి పిలుస్తోంది. భయపడ్డాడతను.‘‘భయపడకు! చూశావా, నా చేతిలోని బంగారు కడియం. దీనిని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలని కోరిగ్గా ఉంది. అందుకే పిలిచాను. చెరువులో స్నానం చేసి, శుచిగా రా! ఈ బంగారు కడియాన్ని తీసుకో’’ అంది పులి. బంగారు కడియాన్ని వేళ్ళ మధ్య ఉంచి ఆడించసాగింది. బాటసారి కడియాన్ని చూశాడు. బాగుందది. మెరుస్తోంది. మంచి బంగారమే! అనుమానం లేదు. అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇంకేమయినా ఉందా? తనని తినేయదూ అనుకున్నాడు. అయినా బంగారాన్ని వదులుకోలేక పోతున్నాడు. ఓ పక్క ప్రాణం, మరో పక్క బంగారం. ఏం చేయాలో అంతుచిక్కట్లేదు బాటసారికి. ఆ అంతుచిక్కని స్థితిలోనే పులితో ఇలా అన్నాడు బాటసారి.